ATM Robbery: కేరళలోని కొచ్చి ఏటీఎంలలో డబ్బు దొంగిలించినందుకు పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముబారక్ అలీ అన్సారీగా (40) గుర్తించారు. ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు. ఏటీఎం మిషన్‌లో ఓ పరికరాన్ని అమర్చి అలీ.. ఇతరుల డబ్బు దొంగిలించేవాడని చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీ అన్సారీ అనే వ్యక్తి కొచ్చిలోని 11 ఏటీఎంల నుంచి డబ్బు దొంగిలించాడు. ఏటీఎం మిషన్‌లో ఓ పరికరాన్ని అమర్చి.. ఆగస్టు 18 నుంచి ఇలా చోరీలకు పాల్పడుతున్నాడు. దాని ద్వారా ఎవరైనా డబ్బులు తీయడానికి వస్తే వారి అకౌంట్లో నగదు కట్ అవుతుంది కానీ, ఏటీఎం నుంచి మనీ బయటకు రాదు. తరువాత అలీ ఏటీఎంలోపలికి వెళ్లి ఆ పరికరాన్ని తొలగించి.. వారి డబ్బును దొంగిలించేవాడు. నిందితుడు 2018లో ముంబయిలో డ్రైవర్‌గా పని చేసేవాడు. అప్పుడే ఏటీఎం నుంచి డబ్బు దొంగిలించడం గురించి కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకుని ఈ చోరీలకు పాల్పడ్డాడు. అలీ గతంలో ఓసారి అరెస్టు కూడా అయినట్లు పోలీసులు తెలిపారు.