ఉత్తర్‌ప్రదేశ్ మథురకు చెందిన ఓ రైతు భూ వివాదాలపై ఆరు సంవత్సరాల నుంచి ఫిర్యాదు చేస్తున్నాడు. ఎప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు తన గోడును పట్టించుకోవట్లేదని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే విసుగు చెందిన బాధితుడు.. శుక్రవారం 12కేజీల ఫిర్యాదు పత్రాలను తలపై మోసుకుని అధికారుల దగ్గరకు వెళ్లాడు.
12 కేజీల పత్రాలు తలపై మోస్తూ నిరసన.. ఆరేళ్లుగా ఫిర్యాదులు చేస్తూ ఆఫీసుల చుట్టూ..
న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఆరు సంవత్సరాల నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు ఓ వ్యక్తి. దీంతో విసుగు చెంది.. 12కేజీల ఫిర్యాదు పత్రాలను తలపై మోసుకుని అధికారుల వద్దకు వెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. అసలేం జరిగిందంటే..
చరణ్‌సింగ్ అనే వ్యక్తి ధాకుబిబావాలి గ్రామంలో నివసిస్తున్నాడు. అతడికి ఉన్న భూమిని గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో అతడు ఆరు సంవత్సరాల క్రితం తన మొదటి కంప్లైంట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన 211 సార్లు తన సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. భూమికి సంబంధించిన ఫిర్యాదు కావటం వల్ల వాటికి దరఖాస్తు పత్రాలను జోడించడం వల్ల ఆ ఫిర్యాదు పత్రాల బరువు 12కేజీలకు చేరింది. ఈ పత్రాలన్నింటినీ ఆయన తన తలపై మోసుకుని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు.
అయితే ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తన గోడును పట్టించుకోవట్లేదని ఆ వ్యక్తి వాపోయాడు. తన పొలాన్ని తప్పుడు కొలతలతో కొలిచి చక్రోద్ ఏర్పాటు చేశారని చరణ్‌సింగ్ అన్నారు. అయితే ఈ విషయంపై ఎస్డీఎం మంత్ర ఇంద్రనందన్ సింగ్ మాట్లాడుతూ.. " ఫిర్యాదు చేసిన వ్యక్తే గ్రామ సభ భూమిని ఆక్రమించాడు. ఈ కేసు విచారణ అనంతరం అతడిపై చర్యలు కూడా తీసుకున్నాం. ఇప్పటికీ ఈ విషయం పరిశీలనలో ఉందని" ఆయన పేర్కొన్నారు.