పెళ్లి కుదిరిన యువతిని ప్రేమిస్తున్నానంటూ.. కొన్ని రోజులుగా ఓ పోకిరి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా.. తనను ప్రేమించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆమెకు కాబోయే భర్తకు సైతం ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు ఆ యువకుడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
ఇదీ కథ..
ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ బర్రా ప్రాంతానికి చెందిన ఓ యువతి బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఇటీవలె పెళ్లి కుదిరింది. ఆయితే కొంత కాలంగా యువతి సమీప కాలనీలో ఉండే ఓ యువకుడు.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని.. పెళ్లి నిశ్చయమైందని పలుమార్లు చెప్పిన వినిపించుకోకుండా ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. యువతి శనివారం ఉదయం పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరగా.. ఆమె వెంటపడ్డాడు యువకుడు. ఆమెను మార్గమధ్యలో రోడ్డుపై అడ్డుకొని.. ప్రేమించాలంటూ ఇబ్బంది పెట్టాడు. ఒక్కసారిగా తన జేబులో నుంచి సింధూరం తీసి అమ్మాయి నుదుట పెట్టి.. 'మన ఇద్దరినీ ఇప్పుడు ఎవరూ విడదీయలేరంటూ' బెదిరింపులకు దిగాడు. నడి రోడ్డుపై యువకుడి వెకిలి చేష్టలు చూసి చుట్టు పక్కల వారు ఆశ్చర్యానికి గురయ్యారు.