UP CM Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మకర సంక్రాంతి సందర్భంగా గోరఖ్‌పుర్‌లో పర్యటించారు. ఓ దళితుడి ఇంటికి వెళ్లి వారితో పాటు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఎస్పీ అధికారంలో దళితులు సామాజిక బహిష్కరణకు గురయ్యారని, సామాజిక న్యాయమనేదే లేదని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం ఎలాంటి వివక్ష లేకుండా కృషి చేస్తోందన్నారు.
భాజపా ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని విమర్శలు చేస్తూ స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీ శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరిన క్రమంలో.. దళితుడి ఇంట్లో యోగి భోజనం చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
గోరఖ్‌పుర్‌లోని దళిత వర్గానికి చెందిన అమృత్లాల్ ఇంట్లో భోజనం చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు సీఎం యోగి. అఖిలేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
" అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 18వేల ఇళ్లు మాత్రమే ప్రజలకు ఇచ్చారు. కానీ, భాజపా ప్రభుత్వం ఇప్పటి వరకు 45 లక్షల ఇళ్లను పేదలకు ఇచ్చింది. ఎస్పీ ప్రభుత్వ హయంలో జరిగింది సామాజిక బహిష్కరణే కానీ, సామాజిక న్యాయం కానేకాదు. ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఉజ్వల యోజన కింద 1.36 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందాయి. 2.61 కోట్ల కుటుంబాలకు శౌచాలయాలు నిర్మించాం. వారసత్వ రాజకీయాల చేతిలో ఉన్నవారు ఎప్పటికీ సమాజంలోని ఏ ఒక్కరికీ న్యాయం చేయలేరు. దళితులు, పేదవారి హక్కుల పట్ల ఎస్పీ ప్రభుత్వం దోపిడికి పాల్పడింది."
- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి.