Uttar Pradesh assembly election: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని భాజపా ఒకవైపు, అయిదేళ్లక్రితం చేజారిన గద్దెను మళ్లీ సొంతం చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ మరోవైపు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పోటీలో ఉన్నా ప్రధానపోరు భాజపా, ఎస్పీ మధ్యే సాగుతోంది. ఈక్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిన పశ్చిమ యూపీలో అన్నదాతల ఆగ్రహాన్ని అధిగమించేందుకు ఆ ప్రాంతంలో గట్టి పట్టున్న రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తుకు భాజపా యత్నించిందని సమాచారం. అయితే ఆర్.ఎల్.డి మాత్రం ఎస్పీతో పొత్తుకే మొగ్గు చూపింది. యూపీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
మానసిక యుద్ధ వ్యూహంతో..
ఆర్.ఎల్.డి అధినేత జయంత్ చౌదరి పశ్చిమ యూపీలో గట్టి ప్రాబల్యం ఉన్న జాట్ సామాజికవర్గానికి చెందిన నేత. యూపీలో ఏ పార్టీ గెలవాలన్నా జాట్ ఓట్లు చాలా కీలకం. సాగుచట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో జాట్ వర్గానికి చెందిన రైతులే ఎక్కువగా పాల్గొన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన ఆర్.ఎల్.డితో సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోవటంతో.. తమకు ఏ నష్టం జరగకుండా మానసిక యుద్ధం అనే వ్యూహానికి భాజపా తెరతీసింది. ఎస్పీ, ఆర్.ఎల్.డి కూటమి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా పాచికలు విసురుతోంది. ఒకవేళ యూపీ శాసనసభ ఎన్నికల్లో ఈ కూటమి గెలిస్తే ఆర్.ఎల్.డిని ఎస్పీ తమ కూటమి నుంచి బయటకు పంపిస్తుందని భాజపా ప్రచారం మొదలుపెట్టింది. దీనిద్వారా ఆ వర్గం ఓటర్లలో అనుమాన బీజాలు నాటి అయోమయం సృష్టించడమే భాజపా వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమిత్ షా ఆరోపణలు..
పశ్చిమ యూపీలోని ముజఫర్ నగర్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్, ఆర్.ఎల్.డి అధినేత జయంత్ చౌదరి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించగా, శనివారం హోంమంత్రి అమిత్ షా భాజపా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎస్పీ, ఆర్.ఎల్.డి కలిసే ఉందని మీడియా సమావేశంలో అఖిలేశ్ పదేపదే స్పష్టం చేయగా, దీనిని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఒకవేళ ఎస్పీ అధికారంలోకి వస్తే.. జయంత్ చౌదరిని పక్కకునెట్టి జైళ్లో ఉన్న ఆజంఖాన్‌ను అఖిలేష్ అక్కున చేర్చుకుంటారని అమిత్ షా ఆరోపించారు.
" శుక్రవారం నేను అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌదరి మీడియా సమావేశాన్ని చూశాను. అఖిలేశ్ చాలా చక్కగా మాట్లాడారు. తాము కలిసే ఉన్నామని అఖిలేశ్ అన్నారు. కానివారు ఎప్పటివరకు కలిసి ఉంటారో నేను చెప్పనా? ఓట్ల లెక్కింపు రోజువరకు మాత్రమే కలిసి ఉంటారు. ఒక వేళ ఎస్పీ కూటమి అధికారంలోకి వస్తే జయంత్ చౌదరిని బయటకు పంపుతారు. ఆజంఖాన్ అధికార పీఠంపైకి వస్తారు. ఆజంఖాన్ ఇప్పటికైతే జైలులో ఉన్నారు. ఎస్పీ కూటమితో మనం జయంత్ చౌదరిని చూడలేం. ఈ విధంగా అఖిలేశ్ యాదవ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోలేమా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో టిక్కెట్లను పంచుకున్నప్పుడే మనకు అర్థం అయ్యింది."