Uterus In Man Body : కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిలో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని గుర్తించారు వైద్యులు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి ఆపరేషన్ చేసి తొలగించారు డాక్టర్లు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తరి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
ఇదీ జరిగింది
ధమ్‌తరికి చెందిన 27 ఏళ్ల యువకుడు కొద్దిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో సెప్టెంబర్ 25న సమీపంలోని ఆస్పత్రిలో సంప్రదించగా.. పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలని సూచించారు వైద్యులు. వెంటనే శస్త్రచికిత్స మొదలుపెట్టిన వైద్యులకు ఊహించని షాక్ తగిలింది. యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన వైద్యులు.. దాదాపు గంటన్నర పాటు ఆపరేషన్ చేసి కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని.. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని తెలిపారు.
"ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అతడు ఇప్పుడు చెప్పకపోతే సమస్య మరింత తీవ్రంగా మారేది. భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉండేది."
--రోషన్ ఉపాధ్యాయ్, డాక్టర్