అఫ్గానిస్థాన్‌లో(Afghan Crisis) రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి తెరదించి అమెరికా దళాలు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఫలితంగా పొరుగు దేశాలకు ఆందోళనకర పరిస్థితులు, భద్రతాపరమైన అనిశ్చితులు నెలకొన్నాయి. తాలిబన్లకు(Afghan Taliban) చైనా, పాకిస్థాన్, ఇరాన్ మద్దతుగా ఉంటాయనే విషయంలో సందేహం లేనప్పటికీ.. ఆ దేశాలు తాలిబన్లను ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత గాలులు ఎలా వీస్తాయోనని ప్రస్తుతానికి వేచి చూసే ధోరణినే అవలంబిస్తున్నాయి. అఫ్గాన్‌లో శాంతిని నెలకొల్పుతామని హామీ ఇచ్చిన తాలిబన్ల ప్రభుత్వం ఐక్యతా విధానాన్ని పాటిస్తుందా? లేదా? అని తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాయి.
బలగాల ఉపసంహరణ(US troops Withdraw) ప్రారంభించిన తర్వాత తమ ప్రజలను స్వదేశానికి తరలించేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు తాలిబన్లు మాత్రం అఫ్గాన్ సహా రాజధాని కాబుల్‌లో అంతకంతకూ తమ బలాన్ని పెంచుకుంటూ పోయారు. కాబుల్ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్లు జరిగిన తర్వాత మరింత పకడ్బందీగా ఆ ప్రాంతంపై పట్టు సాధించారు.
1990లతో పోల్చితే తాలిబన్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తమకు వ్యతిరేకంగా పనిచేసే మీడియాతో ఎలా వ్యవహరించాలో వారు నేర్చుకున్నట్లు తాలిబన్ల నాయకుడి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను చూస్తే అర్థమవుతోంది. పాశ్చాత్య దేశాలను తమ నేల నుంచి వెళ్లగొట్టేందుకు దోహా ఒప్పందం కుదుర్చుకుని తమ చతురతనూ చాటుకున్నారు.
అమెరికా బలగాల ఉపసంహరణ తరవాత తాలిబన్ల(Taliban News) శక్తి క్రమంగా పెరిగింది. ఇది ఇతర తిరుగుబాటు గ్రూపులకు ధైర్యాన్నివ్వడమే కాకుండా, శక్తిమంతమైన దేశాలతో వారికి అనుకూల షరతులపై చర్చించేలా విశ్వాసాన్ని నింపింది. దాదాపు అఫ్గానిస్థాన్ పొరుగు దేశాలన్నీ తిరుగుబాటు శక్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో వీఘర్లు(china uyghur), ఇరాన్లో ఐసిస్, పాకిస్థాన్‌లో టీటీపీ, భారత్‌లో కశ్మీర్ వేర్పాటువాద శక్తులు ఆయా దేశాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాలిబన్లతో ఈ దేశాలు సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ.. మరోవైపు తిరుగుబాటు శక్తులు మరింత బలపడుతాయేమోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చైనాకు ఈటీఐఎం బెడద..
అఫ్గాన్ బదఖ్షన్ ప్రావిన్సులోని తూర్పు టర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం(ఈటీఐఎం) చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఫైటర్లు తాలిబన్లతో కలిసి అమెరికా సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా పోరాడారు. చైనా షిన్జియాంగ్ ప్రావిన్సులోని వీఘర్ ముస్లింల కోసం వీరు ఉద్యమం చేస్తున్నారు. బదఖ్షన్ ప్రావిన్సుతో షిన్జియాంగ్ ప్రావిన్సు 95 కి.మీ సరిహద్దును పంచుకుంటోంది. దీంతో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోతే వారి మద్దతుతో ఈటీఐఎం మరింత బలపడుతుందని చైనా ఆందోళన చెందుతోంది. కాకసస్ ఎమిరేట్స్ ఆప్ చెచెన్ ఫైటర్లతోనూ రష్యా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటోంది.
పాక్‌కు టీటీపీ తలనొప్పి...
నియంత్రణ లేని తెహ్రీక్-ఏ-తాలిబన్(టీటీపీ) గత దశాబ్ద కాలంగా పాకిస్థాన్‌కు తలనొప్పులు తెస్తోంది. దీని వల్ల భారీ ఆర్థిక, ప్రాణ నష్టం వాటిల్లడమే గాక పాక్‌లోని సాధారణ పౌరులు భద్రతపై ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. బహిరంగ ప్రదేశాలతో పాటు ప్రార్థనా స్థలాల్లోనూ బాంబు దాడులు చేసి పాక్ ప్రజలను హడలెత్తిస్తోంది టీటీపీ. అమెరికా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అఫ్గాన్‌లోని నార్తర్న్ అలయన్స్‌పై తాలిబన్లు దాడి చేశారు. అయితే ఈ పోరాటంలో తాలిబన్లతో టీటీపీ కలిసి నార్తర్న్ అలయెన్స్‌ను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో టీటీపీకి తాలిబన్లు మద్దతిస్తే తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని పాక్ భావిస్తోంది.
భారత్‌కు కశ్మీర్ భద్రత ముప్పు..
తాలిబన్ల వల్ల పాక్, చైనా కంటే భారత్‌కే ఎక్కువ ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముంది. తాలిబన్లతో మనకు సాన్నిహిత్యం గానీ, దూరం గానీ లేదు. అయితే పాకిస్థాన్ ఐఎస్ఐ కార్యకలాపాలు సహా కీలక ఇతర తిరుగుబాటు సంస్థల నియంత్రణ పూర్తిగా వీరి చేతుల్లోనే ఉంది. కశ్మీర్లో గానీ, కశ్మీర్ కోసం జరిగే ఉగ్ర కార్యకలాపాలకు పూర్తి మద్దతు ఉండాలని ఈ సంస్థల మధ్య దాశాబ్దాలుగా ఏకాభిప్రాయం ఉంది.
1999లో అఫ్గాన్ కాందహార్‌లో ఎయిర్ ఇండియా IC 814 విమానం హైజాక్ అయింది. ముగ్గురు కశ్మీర్ ఉగ్రవాదులను విడుదల చేయాలని ఉగ్రసంస్థలు డిమాండ్ చేసినప్పుడే వీరి మధ్య ఐకమత్యం బహిర్గతమైంది. ఆ సమయంలో అఫ్గాన్‌లో తాలిబన్లే అధికారంలో ఉన్నారు. విమానంలోని పౌరులను క్షేమంగా విడిచిపెట్టాలంటే జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్‌ను విడిచి పెట్టాలని అప్పుడు ఉగ్రవాదులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోర్చుగీస్ పాస్పోర్టుతో భారత్‌లోకి ప్రవేశించి కశ్మీర్లో ఉగ్రవాదుల నియామకాలు చేపడుతున్నాడని మసూద్‌ను 1990ల మొదట్లో పోలీసులు అరెస్టు చేశారు. విమానం హైజాక్ చేసిన ఉగ్రవాదుల డిమాండ్ మేరకు అతడిని విడిచిపెట్టారు.