తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్‌పై(Afghanistan) వైమానిక దాడులు జరిపేందుకు భారత ప్రభుత్వాన్ని తాము అనుమతి కోరామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్(Antoni Blinken) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ మేరకు అక్కడి మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
"అఫ్గాన్‌లోని కొత్త తాలిబన్ ప్రభుత్వాన్ని నిశితంగా పరిశీలించేందుకు భారత్‌తో అమెరికా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరుపుతోంది. వారిపై దాడి చేసేందుకు గల సామర్థ్యాన్ని నిరంతరం పరిశీలిస్తోంది. వాయవ్య భారత్ అత్యంత కీలకమైన ప్రాంతం. ఎందుకంటే... కతర్, దోహాతో పోల్చితే అఫ్గాన్‌కు వాయవ్య భారత్‌లోని ప్రాంతాలు చాలా తక్కువ దూరంలో ఉంటాయి. ఉగ్రవాదులకు, ముఖ్యంగా అల్-ఖైదా వంటి వారికి తమ దేశంలో స్థావరం ఇవ్వడం ద్వారా కలిగే పరిణామాల గురించి, తాలిబన్లకు బాగా తెలుసు."
-ఆంటోని బ్లింకెన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
బ్లింకెన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ(Manish Tiwari) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మీడియా కథనాలు నిజమే అయితే.. దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
"వాయువ్య భారత్ నుంచి అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్.. భారత్‌ను కోరింది నిజమేనా? ప్రధానమంత్రి కార్యాలయంపై దీనిపై సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలి."
-మనీష్ తివారీ, కాంగ్రెస్ సీనియర్ నేత