తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముస్లింలు లేని గ్రామంలో ఘనంగా ఉర్సు వేడుకలు.. 200 ఏళ్ల ఆచారం! - urus festival 2023

ముస్లింలు అసలే లేనప్పటికీ ఆ గ్రామంలో ఘనంగా ఉర్సు వేడుకలు జరుగుతున్నాయి. పక్క గ్రామాల నుంచి సూఫీ మతగురువులను పిలిపించి మరీ గ్రామంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. రెండు వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

Muslim family celebrating Urus
Muslim family celebrating Urus

By

Published : Mar 14, 2023, 9:04 AM IST

ముస్లింలు లేని గ్రామంలో ఘనంగా ఉర్సు వేడుకలు

ముస్లింలు ఉన్న ఊర్లలో ఉర్సు పండగను ఘనంగానే నిర్వహించుకుంటారు. హిందువులు, ముస్లింలు కలిసి వేడుకలు జరుపుకోవడమూ మనం చూసే ఉంటాం. కానీ, అసలు ముస్లింలే లేని ఊరిలో ఉర్సు పండగను నిర్వహిస్తున్నారు. గ్రామంలో అంతా హిందువులే అయినప్పటికీ ఈ పండగను నిర్వహిస్తుండటం విశేషం. కర్ణాటకలోని హవేరీ జిల్లా కోననతంబిగె గ్రామానికి వెళ్తే ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంటుంది. అయితే, ఈ సంప్రదాయం నిన్నో మొన్నో ప్రారంభమైనది కాదు. గత రెండు వందల ఏళ్ల నుంచి ఇలా ముస్లిం పండగను ఘనంగా జరుపుకుంటున్నారు కోననతంబిగె గ్రామస్థులు.

ఆదివారం ప్రారంభమైన ఉర్సు పండగ.. ఐదు రోజుల పాటు కొనసాగనుంది. కోననతంబిగె గ్రామానికి సమీపంలో ఉన్న వరద నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పండగను ప్రారంభించుకున్నారు గ్రామస్థులు. గ్రామ శివారులో ఉన్న యమనూర్ దైవాన్ని స్మరించుకుంటున్నారు. పండగలో భాగంగా యమనూర్ రాజభక్ష విగ్రహాన్ని ఊరేగిస్తారు. అనంతరం దేవుడి విగ్రహంతో గ్రామం మొత్తం ఊరేగింపుగా తిరుగుతారు. ఇలా ఘనంగా వేడుకలు చేసి, మొక్కుకుంటే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు.

ఊరేగింపులో భాగంగా తీసుకొచ్చిన రాజభక్ష విగ్రహాన్ని గ్రామంలో ఉన్న ఓ ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. భక్తులంతా వరద నదిలో స్నానాలు చేసుకొని దైవ దర్శనానికి వస్తారు. చక్కెర, ఉప్పు, నూనె వంటి వంట సామగ్రినే దేవుడికి నైవేద్యంగా తీసుకొస్తారు. రైతు కుటుంబాలు తమ పొలాల్లో పండిన కూరగాయలు, ధాన్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులను సైతం దేవుడికి సమర్పించుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడికి చిన్నపిల్లలను సైతం తీసుకొస్తుంటారు. అప్పుడే పుట్టిన శిశువుల దగ్గరి నుంచి బుడి బుడి అడుగులు వేసే బుజ్జాయిల వరకు పిల్లలకు దైవ దర్శనం చేయిస్తారు. ఆలయంలో ఉన్న గడ్డుగె (దేవుడి విగ్రహం ఉండే ప్రాంతం)కు తలను ఆనించేలా చేసి దేవుడి ఆశీర్వాదం స్వీకరించినట్లు భావిస్తారు. సూఫీ మత గురువులు ఇక్కడ అనేక రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు.

గ్రామంలో గడిచిన రెండు వందల ఏళ్ల నుంచి ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విచిత్రంగా ఈ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుండం నివసించడం లేదు. వండగ సమయంలో పూజలు నిర్వహించేందుకు సూఫీ మత గురువులను వేరే గ్రామాల నుంచి పిలిపించుకుంటున్నారు. యలగచ్చ ప్రాంతం నుంచి మత గురువులు వస్తుంటారని గ్రామస్థులు చెబుతున్నారు. మొత్తం ఐదుగురు సూఫీ పీర్లు ఇక్కడ పూజలు నిర్వహించనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ముస్లింలు భక్తులు సైతం ఇక్కడికి వస్తుంటారు. చుట్టు పక్కల ఉర్సు వేడుకలు జరుపుకునే ముస్లింలు.. కోననతంబిగె ప్రాంతాన్ని సందర్శించి వెళ్తుంటారు. పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల నుంచి సైతం ఈ ఉత్సవాలకు వస్తారు.

ఉర్సు వేడుకల్లో భాగంగా గ్రామంలో కుస్తీ పోటీలు సైతం నిర్వహిస్తున్నారు. వేడుకలు పూర్తైన తర్వాత రాజభక్ష విగ్రహాన్ని యమనూర్ ఆలయానికి తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠిస్తారు. మంగలేకర్ వంశస్థులు ఈ ఆలయంలో ఏడాది పాటు పూజలు నిర్వహిస్తుంటారు. ఉర్సు వేడుకలకు రాజస్థాన్​లోని అజ్మీర్ దర్గా ప్రసిద్ధి. సూఫీ సంత్ మోయినుద్దీన్ చిస్తీ వర్ధంతి నేపథ్యంలో ఈ వేడుకలు జరుపుతారు. ఆరు రోజుల పాటు పాటలు పాడుతూ వేడుకలు నిర్వహిస్తారు. ఇస్లామిక్ లునార్ క్యాలెండర్ ప్రకారం ఏడో నెలలో ఈ పండగ ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details