Madhya Pradesh Urination Case : మధ్యప్రదేశ్‌లో ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జనచేసిన ఘటనపై రాజకీయ దుమారం రేగింది. ఇది తీవ్ర వివాదాస్పదం కావడం వల్ల శరవేగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. బుధవారం తెల్లవారుజామున నిందితుడిని అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు.
సీధీ జిల్లాలో మూడు నెలల క్రితం జరిగిన ఈ అమానుష ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారణాలు తెలియవుగానీ.. ఓ వ్యక్తి ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో ఇటీవల వైరల్ కావడం మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించి నిందితుడిని అరెస్టు చేసి జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
టెక్నాలజీ సాయంతో నిందితుడు అరెస్ట్
ఈ అమానవీయ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు వీడియోలో ఉన్న నిందితుడిని ప్రవేశ్ శుక్లాగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతికత సాయంతో నిందితుడిని ట్రాక్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బుల్డోజర్‌తో నిందితుడి ఇల్లు కూల్చివేత
ఆక్రమణదారులు, గ్యాంగ్‌స్టర్లు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారి పట్ల యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తూ వారి ఆస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తుండగా.. ఇప్పుడు శివరాజ్‌సింగ్ చౌహాన్ సర్కార్ కూడా ఇదే పంథా అనుసరిస్తోంది. గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్‌తో నేలమట్టం చేసింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు పోలీసు భద్రత మధ్య ప్రవేశ్ శుక్లా నివాసాన్ని కూల్చివేశారు.
బీజేపీ నాయకుడేనన్న కాంగ్రెస్!
నిందితుడు ప్రవేశ్ శుక్లాకు బీజేపీతో సంబంధం ఉందని హస్తం పార్టీ ఆరోపించగా కమలనాథులు తీవ్రంగా ఖండించారు. నిందితుడు తమ పార్టీ సభ్యుడు ఎంత మాత్రం కాదన్నారు.