బంగాల్లో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ.. తదుపరి దశల్లో జరిగే ఎన్నికలపై పునఃపరిశీలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘాన్ని కోరారు. మూడు దశల పోలింగ్‌ను ఒకరోజులో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలా కానిపక్షంలో కనీసం రెండు రోజుల్లోనైనా పూర్తి చేయాలని దినాజ్‌పుర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈసీని అభ్యర్థించారు దీదీ. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈసీ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.
"చేతులు జోడించి ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నా. రాష్ట్రంలో జరిగే మిగిలిన మూడు దశల పోలింగ్‌ను ఒకే దఫాలో నిర్వహించండి. కుదరకపోతే కనీసం రెండు రోజులకు కుదించే ఏర్పాటు చేయండి."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
భాజపాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఈసీని కోరారు దీదీ. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ షెడ్యూల్‌ను కుదించాలని కోరారు.