తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అర్బన్ నక్సల్స్'​పై మోదీ ఫైర్.. కోర్టులనూ ప్రభావితం చేస్తున్నారంటూ.. - modi gujarat news

'అర్బన్ నక్సల్స్', అభివృద్ధి వ్యతిరేక శక్తులపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతూ వీరంతా అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచబ్యాంకు వంటి సంస్థలతో పాటు న్యాయస్థానాలనూ ప్రభావితం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

pm-modi speech today
pm-modi news

By

Published : Sep 23, 2022, 3:34 PM IST

PM Modi on Urban Naxals : సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యం కావడానికి అర్బన్ నక్సలైట్లు, అభివృద్ధి వ్యతిరేక శక్తులే కారణమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతూ రాజకీయ ప్రోద్బలంతో డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి అర్బన్ నక్సల్స్ ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నారని.. వీరికి వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని ఏక్తానగర్​లో నిర్వహించిన పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల పర్యావరణ మంత్రులకు పలు సూచనలు చేశారు.

"పర్యావరణ అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమతుల విధానాన్ని పాటించాలి. సర్దార్ సరోవర్ డ్యామ్​ను అడ్డుకునేందుకు కొందరు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. ప్రపంచ బ్యాంకుతో పాటు న్యాయస్థానాలను సైతం ప్రభావితం చేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. దీని వల్ల భారీగా ధనం వృథా అయింది. ఇప్పుడు డ్యామ్ పూర్తైంది. అర్బన్ నక్సల్స్, అభివృద్ధి వ్యతిరేక శక్తుల ఆరోపణలు తప్పు అని తేలింది. పర్యావరణానికి హాని జరుగుతుందని వారు ఆరోపించారు. దానికి భిన్నంగా.. డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతమంతా ప్రకృతి ప్రేమికులకు తీర్థక్షేత్రంగా మారింది. సులభతర వాణిజ్యం, సులభతర జీవనం అందించేందుకు చేపట్టే ప్రాజెక్టులకు అడ్డంకులు ఎదురవకుండా రాష్ట్రాల పర్యావరణ మంత్రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

PM Modi speech today : పర్యావరణ అనుమతులు జారీ చేయడంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మోదీ. ఈ అనుమతులు త్వరగా మంజూరు చేసినప్పుడే.. రాజీ పడకుండా పనులు చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. "దేశంలో పర్యావరణ అనుమతుల కోసం ఆరు వేల దరఖాస్తులు, అటవీ శాఖ అనుమతులు కోరుతూ 6500 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. అనుమతులు ఆలస్యమైతే ప్రాజెక్టు వ్యయాలు పెరుగుతాయి. నిజమైన సమస్యలు ఉంటేనే దరఖాస్తులు పెండింగ్​లో ఉంచాలి. ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు మనమంతా ప్రయత్నించాలి. పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేస్తే ఆర్థిక వ్యవస్థతో పాటు పర్యావరణానికీ మంచి జరుగుతుంది" అని మోదీ చెప్పారు.

అడవుల్లో కార్చిచ్చులను ఎదుర్కొనేందుకు అటవీశాఖ సిబ్బందికి శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. అటవీ వ్యర్థాలను ఉపయోగించి ఇంధనాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రారంభించిన వాహన తుక్కు విధానాన్ని రాష్ట్రాలన్నీ అమలు చేయాలని కోరారు. కాలం చెల్లిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చాలని సూచించారు.

గుజరాత్​లోని నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్​ను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఈ ప్రాజెక్టుకు 1961లో అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1979లో ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసేందుకు ముందుకు రాగా.. 1987లో నిర్మాణం ప్రారంభమైంది. అయితే, సమీప ప్రజలకు సరైన పునరావాసం కల్పించాలంటూ 'నర్మదా బచావో ఆందోళన్' ఉద్ధృతం కాగా.. 1995లో ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2000-01 ఏడాదిలో సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టు ఎత్తును 111 మీటర్లకు తగ్గించి కొత్త ప్రతిపాదనలు తయారు చేశారు. అనంతరం, 2006లో 123 మీటర్లకు, 2017లో 139 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును పెంచారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు 2017లో పూర్తి కాగా.. ప్రధాని మోదీ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details