అక్రమార్కుల ధాటికి నగరాల్లో మురుగు, వరద నీటిపారుదల వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. చెరువులు, నాలాల ఆక్రమణలతో నీళ్ల రాకపోకలకు దారులు మూసుకుపోయి పట్టణ ప్రాంతాలు తీవ్రంగా ముంపునకు గురవుతున్నాయి. నిరుడు అక్టోబరులో భాగ్యనగరంలో ఒకరోజులో కురిసిన కుండపోత వర్షానికి వందల కాలనీలు నీట మునగడంతో వేల కుటుంబాలు విలవిల్లాడాయి. 33 మంది దుర్మరణం పాలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల మేరకు కొన్ని రోజుల పాటు నీరు నిలిచిపోయి అపార నష్టం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వరదలకు ఆక్రమణలే ముఖ్య కారణమని నీతి ఆయోగ్ విస్పష్టంగా పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ప్రత్యేక ప్రణాళిక ఏదీ లేదని, వాతావరణ హెచ్చరికలను సైతం సరిగ్గా వినియోగించుకోలేక పోవడంతో భారీ నష్టం చోటుచేసుకుందని చెప్పింది. హుస్సేన్ సాగర్, మూసీకి నీళ్లను తీసుకెళ్లే మురుగు నాలాలన్నీ ఆక్రమణలకు గురవడంతోనే తీవ్రస్థాయి వరద ముంచెత్తిందని వెల్లడించింది.
నగరీకరణ వేగంతో...
ఉపాధి అవకాశాల కోసం పల్లెల నుంచి వలసలు భారీగా పెరుగుతుండటంతో పట్టణాలు, నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో వాటి చుట్టుపక్కల ఉండే చిత్తడి నేలలు క్రమేణా కనుమరుగవుతున్నాయి. వేల సంఖ్యలో ఉండే చెరువులు ఆక్రమణలకు గురవుతూ వందల్లోకి చేరుకుంటున్నాయి. విస్తరిస్తున్న జనాభాతో భూ వినియోగం పెరిగిపోతోంది. ఎకరా వ్యవసాయ భూమి విలువ కోట్ల రూపాయలకు చేరడంతో కొందరు భూబకాసురులు కుంటలు, చెరువులు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ ఆక్రమణల పర్వం కొందరు రాజకీయ నేతల అండదండలతో యథేచ్ఛగా సాగిపోతోంది. నాలాల ఆక్రమణతో మురుగు నీరు పోయే మార్గాలు తగ్గిపోతున్నాయి. దీంతో వర్షాకాలంలో ముంపు సమస్య తీవ్రమవుతోంది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మురుగు నీటిపారుదల వ్యవస్థ విస్తరించట్లేదు సరికదా, దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న నాలాలు సైతం ఆక్రమణలతో చిక్కిపోతున్నాయి.
హైదరాబాద్‌లో నిజాం కాలంలో నిర్మించిన నాలాలు చాలా ప్రాంతాల్లో కనుమరుగయ్యాయి. 1221 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నాలాల్లో 390 కిలోమీటర్ల మేరకు మేజర్ డ్రెయిన్లు ఉండగా 28 వేల వరకు ఆక్రమణలు ఉన్నాయని 2003లో కిర్లోస్కర్ కమిటీ వెల్లడించింది. ఆక్రమణల తొలగింపు, నాలాల విస్తరణకు అయిదు వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసింది. వర్షపు నీటిని తరలించే నీటి వనరుల విస్తీర్ణం వేగంగా పడిపోవడంతో భారీ వర్షాల సమయంలో వందలాది కాలనీలు నీట మునుగుతున్నాయని, వెంటనే నీరు సాఫీగా సాగేలా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళించాలని హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ పర్యావరణ కేంద్రం గతంలోనే సూచించింది. ప్రభుత్వాలు కమిటీలు వేయడం, వాటి నివేదికలను బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారుతోంది. అరకొర నిధులతో పనులు ప్రారంభించి అనంతరం పట్టించుకోకపోవడంతో గత సంవత్సరం మహానగరం వరదలతో అల్లకల్లోలమైంది. వీటి ధాటికి 37,409 కుటుంబాలు ప్రభావితమైనట్లు జీహెచ్‌ఎంసీ అంచనా వేసింది. నగరానికి రూ.670 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని పురపాలక మంత్రి స్పష్టం చేశారు. భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్యను తట్టుకునేలా నగరం నుంచి బాహ్యవలయరహదారి వరకు నాలాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.858 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ) చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది జరిగి నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలాలపై ఉన్న 10 వేల ఆక్రమణలను కూల్చాలనుకున్నా వెయ్యింటిని కూడా కూల్చలేకపోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతతో వ్యవహరించడంతో పాటు శాసనసభ్యులు, స్థానిక నేతలు సహకరిస్తేనే చెరువుల ఆక్రమణల తొలగింపు, నాలాల ప్రక్షాళన సాధ్యం అవుతుంది.
పకడ్బందీ కార్యాచరణ అవసరం..