తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదరగొట్టిన ఇషిత​, గరిమ, ఉమ, స్మృతి.. అమ్మాయిలే UPSC సివిల్స్ టాపర్స్

UPSC Civils Final Results 2022 : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్​సీ నిర్వహించిన సివిల్స్‌ 2022 తుది ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. తొలి నాలుగు ర్యాంకుల్లో ఇషితా కిశోర్‌, గరిమా లోహియా, ఉమా హారతి, ఎన్‌. స్మృతి మిశ్రా మెరిశారు.

upsc civils final results 2022 toppers
upsc civils final results 2022 toppers

By

Published : May 23, 2023, 3:27 PM IST

Updated : May 23, 2023, 6:34 PM IST

UPSC Civils Toppers : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్​సీ నిర్వహించిన సివిల్స్​-2022 తుది ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా టాప్‌ ర్యాంకర్లుగా అమ్మాయిలే సత్తా చాటారు. తొలి నాలుగు ర్యాంకులను వారే సాధించారు. ఇషితా కిశోర్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. గరిమా లోహియా, ఉమా హారతి ఎన్‌, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు.

తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థులు వీళ్లే

  1. ఇషితా కిశోర్ (దిల్లీ యూనివర్సిటీ)
  2. గరిమా లోహియా (దిల్లీ యూనివర్సిటీ)
  3. ఉమా హారతి (ఐఐటీ హైదరాబాద్​)
  4. స్మృతి మిశ్రా (దిల్లీ యూనివర్సిటీ)
  5. మయూర్ హజారికా
  6. గెహ్నా నవ్య జేమ్స్
  7. వసీం అహ్మద్ భట్
  8. అనిరుధ్ యాదవ్
  9. కనికా గోయల్
  10. రాహుల్ శ్రీవాస్

ఎవరీ ఇషితా కిశోర్​?
Ishita Kishore UPSC Topper : సివిల్స్​ తుది ఫలితాల్లో టాపర్​గా నిలిచిన ఇషితా కిశోర్.. ఉత్తర్​ప్రదేశ్​ వాసి. గ్రేటర్‌ నొయిడాలోని బాల్‌ భారతి స్కూల్​లో చదివిన ఇషిత.. 2017లో దిల్లీలోని శ్రీరామ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్‌లోని ఎర్నెస్ట్‌ అండ్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ అనే ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ సంస్థలో రిస్క్‌ అడ్వైజర్‌గా పనిచేశారు. సివిల్‌ సర్వీసెస్‌ మీద ఆసక్తితో యూపీఎస్​సీ పరీక్షలపై దృష్టి సారించారు. తొలి ప్రయత్నంలో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలోనే ఉత్తీర్ణత సాధించలేదు.

ఇషితా కిశోర్​

అయినా నిరాశ పడకుండా రెండోసారి ప్రయత్నించారు ఇషిత. అప్పుడు కూడా ప్రిలిమ్స్‌ కూడా దాటలేకపోయారు. గతేడాది ముచ్చటగా మూడోసారి సివిల్స్‌ పరీక్ష హాజరయ్యారు. ఈసారి ప్రిలిమ్స్‌ గట్టెక్కడం వల్ల తనపై తనకు నమ్మకం పెరిగింది. దీంతో మరింత కష్టపడి చదివి మెయిన్స్‌, ఇంటర్వ్యూకు హాజరైన ఆమె దేశవ్యాప్తంగా తొలి ర్యాంక్‌ సాధించారు. ఈ సందర్భంగా ఇషితా కిశోర్​ ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న యూపీఎస్​సీ టాపర్​ ఇషితా కిశోర్​

"యూపీఎస్​సీ పరీక్షలో ఈసారి తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం ఉంది. కానీ ఏకంగా ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తుందని ఊహించలేకపోయాను. ఐఏఎస్‌లో చేరి దేశానికి సేవ చేయాలన్నదే నా కల. ఆ అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మెయిన్స్‌ పరీక్షల కోసం చాలా కష్టపడ్డా. గత ప్రశ్నాపత్రాలను చూసి ప్రాక్టీస్‌ చేశా. వార్తాపత్రికల నుంచి నోట్స్‌ తయారు చేసుకుని రివిజన్‌ చేసుకున్నా. ఇవన్నీ నేను సివిల్స్‌ సాధించేలా చేశాయి"

-- ఇషితా కిశోర్​, యూపీఎస్​సీ టాపర్​

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
UPSC Telugu Toppers 2022 : తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు విద్యార్థులు సివిల్స్‌లో సత్తా చాటారు. తెలంగాణలోని నారాయణపేటకు చెందిన నూకల ఉమా హారతి మూడో ర్యాంకు సాధించారు. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకుతో మెరిశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మీ సుజిత 311, ఎన్‌.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్‌ 362, యప్పలపల్లి సుష్మిత 384, సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.

UPSC Civils Final Results 2022 : సివిల్స్‌- 2022 తుది ఫలితాలు.. మంగళవారం విడుదల అయ్యాయి. మొత్తం 933 మందిని యూపీఎస్​సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్​సీ నుంచి 154, ఎస్​టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బీ సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్​సీ ప్రకటించింది. ఫలితాల ప్రకటన తేదీ నుంచి 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో మార్కులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Last Updated : May 23, 2023, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details