మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 46 కోతులు మరణించాయి. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హసన్ జిల్లా బెలూర్ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఈ ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనెసంచులు మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా.. అందులో కోతుల కన్పించాయి. కొన్ని సంచుల్లో ఉన్న కోతులు అప్పటికే మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి. మొత్తం 46 వానరాలు చనిపోగా.. మరో 20 గాయపడ్డాయి. దీంతో ఆ యువకులు గాయపడిన కోతులను బయటకు తీసి నీరు తాగించారు. ఇందులో 18 కోతులు కోలుకోగా.. మరో రెండింటిని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.