బంగాల్ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు వెయ్యేనుగుల బలాన్నిచ్చాయి. భాజపా నాయకత్వం ఒకసారి దృష్టి సారిస్తే వారిని ఎదిరించి నిలవడం కష్టమన్న భావనను ఇవి చెరిపేశాయి. పోరాడితే భాజపాను ఓడించడం కష్టమేమీకాదన్న అభిప్రాయం విపక్షాల్లో కలిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది మే లోపు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు.
ఉత్తరాఖండ్‌లో అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తోంది. పంజాబ్‌లోనూ 2012లో మినహా అన్నిసార్లూ అధికారం చేతులు మారుతూ వచ్చింది. 1991 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అధికారం భాజపా, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల మధ్య దోబూచులాడుతూ వస్తోంది. అక్కడా ప్రతి అయిదేళ్లకోసారి అధికారం మారుతోంది. 2017లో గోవా, మణిపూర్‌లలో భాజపా పూర్తిస్థాయి మెజార్టీ సాధించక పోయినా ఫిరాయింపులతో అధికారాన్ని చేజిక్కించుకొంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎవరూ ఊహించని అఖండ మెజార్టీని సాధించింది. అమిత్‌షా వ్యూహ చాతుర్యం, ప్రధాని మోదీ ప్రజాకర్షణతో ఆ రెండు రాష్ట్రాల్లో భాజపా సునామీని సృష్టించగలిగింది. అందుకే వారిద్దరూ రంగంలోకి దిగితే ప్రతిపక్షాలు గల్లంతే అన్న భావన కలిగింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో వారిద్దరూ అదే ధోరణిలో పనిచేసినా మమతా బెనర్జీ సునామీని ఆపలేకపోవడం ప్రతిపక్షాలకు బలాన్నిచ్చింది. ఆ ధ్వయం అభేద్యమైందేమీ కాదని, ధైర్యంగా పోరాడితే ఓడించడం కష్టమేమీకాదన్న సందేశాన్ని బెంగాల్ ఫలితాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పార్టీల బలాబలాలు
పార్టీల తాజా బలబలాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ కారణంగా పంజాబ్‌లో కాంగ్రెస్ పటిష్ఠంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ శిరోమణి అకాళీదళ్, భాజపా విడిపోయిన తర్వాత ప్రతిపక్షం బలహీనమయింది. ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రుల మార్పు భాజపాకు ఇబ్బంది కలిగించేదే. అయిదేళ్లకోసారి అధికారం మారే ఆనవాయితీ ఉండడం కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశం. గోవాలో మనోహర్ పారికర్ లేకపోవడం భాజపాకు కొంత వెలితి. ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం అధికార భాజపా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మధ్యే రాజకీయ సమరం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో పెద్దగా కనిపించకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికలు యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్‌లా జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. 2017 ఎన్నికలు మోదీ ప్రజాకర్షణ శక్తిమీద సాగినా రాబోయే ఎన్నికలు మాత్రం యోగి ఆదిత్యనాథ్ పరిపాలనపై తీర్పుగా మారే అవకాశం ఉంది. పోటీ హోరాహోరీగానే ఉంటుంది.