ఉత్తరప్రదేశ్లోని బరాబంకీ జిల్లాలో ఓ మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది: పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బదోస్రాయ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు స్థానిక యువకుడు మొబైల్ ఫోన్ ఇచ్చాడు. అప్పటినుంచి తరచూ ఆమె ఆ యువకుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. సెప్టెంబర్ 17న ఆ యువకుడు మహిళ ఇంటికి వచ్చాడు. భర్త పిలుస్తున్నాడని మహిళకు అబద్ధం చెప్పి.. ఆమెను వెంట తీసుకెళ్లాడు.
గ్రామ శివారుకు వెళ్లాక ఆ యువకుడితో పాటు మరో నలుగురు యువకులు ఉన్నారు. బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహ వచ్చిన బాధితురాలు ఇంటి చేరుకుంది. మొదట ఈ ఘటన గురించి ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత ధైర్యం చేసుకుని భర్తకు చెప్పింది. సెప్టెంబర్ 23న పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసును పరిశీలించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.