Up Wall Collapse : ఉత్తరప్రదేశ్ నొయిడాలో హౌసింగ్ సొసైటీ ప్రహరీ గోడలో..కొంత భాగం కూలిపోవడంతో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సెక్టార్ 21లోని జల్ వాయు విహార్‌లో ఈ దుర్ఘటన జరిగిందన్న అధికారులు.. ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయిందన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని వెలికితీశామని.. అందులో నలుగురు మరణించినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చన్న అనుమానంతో సహాయ చర్యలను ముమ్మరం చేశారు.
ప్రహరీ గోడ కూలి నలుగురు దుర్మరణం.. డ్రైనేజీ పనులు చేస్తుండగా ప్రమాదం - Noida wall collapses news
ఉత్తరప్రదేశ్ నొయిడాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు కన్నుమూశారు. మొత్తం 12 మందిని శిథిలాల కింద నుంచి వెలికితీయగా.. అందులో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.
హౌసింగ్ సొసైటీ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. కూలీలు ఇటుకలను బయటకు తీస్తున్నప్పుడు గోడ కూలిపోయిందని ప్రాథమికంగా నిర్థారించారు. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్దేశించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.