UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు రామమందిరం, హిందుత్వ వంటి అంశాల కంటే.. అభివృద్ధి, ప్రభుత్వ పనితీరు నచ్చే మళ్లీ భాజపాకు పట్టంగట్టారు. ఈ నెల పదో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన ఈ రాష్ట్రంలో 'ది లోక్‌నీతి - సీఎస్‌డీఎస్' సంస్థలు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాయి. రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కంటే కూడా నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరుతో ప్రజలు మూడింతలు ఎక్కువ సంతృప్తితో ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.
మొత్తానికి యూపీలో భాజపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా 'మోదీ మేజిక్' బాగా పనిచేసిందని వెల్లడించింది. కులం, మతంతో ప్రమేయం లేకుండా కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల పథకం, పీఎం ఆవాస్ యోజన, ఉచిత రేషను వంటి పథకాలతో కొత్తగా పలువురు లబ్ధి పొందినట్లు సర్వే తెలిపింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కమలదళంలో ఎన్నికల ముందున్న భయాలన్నీ చెల్లాచెదురు చేస్తూ రైతులు, బ్రాహ్మణులు, ఎస్సీలు, మాయావతికి ఓటుబ్యాంకుగా ఉన్న జాటవ్ వర్గీయుల మద్దతు కూడా భాజపాకు పుష్కలంగా లభించింది.