UP Train Accident Today :దిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన భారీ అగ్నిప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ దిల్లీ నుంచి బిహార్‌లోని దర్భంగాకు వెళ్తోంది. బుధవారం సాయంత్రం సరాయ్ బోపత్ రైల్వే స్టేషన్‌ను దాటుతుండగా ఎస్1 బోగీ నుంచి పొగ రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించారు.
వెంటనే లోకోపైలట్‌కు సమాచారం ఇచ్చి.. రైలును ఆపేశారు. మంటల వ్యాప్తితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో రైలు నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. క్షణాల్లోనే మంటలు మరింత తీవ్రమై.. ఎస్1 బోగీ పూర్తిగా కాలిపోయింది. పక్కనే ఉన్న మరో రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి.
UP Train Accident Latest News: ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. మంటలు రావడానికి కారణమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఎస్ఎస్పీ సంజయ్ కుమార్ వర్మ తెలిపారు.
అయితే.. ఎస్1 బోగీ కింద సిలిండర్ పేలుడు జరిగిందని, ఆ తర్వాత మంటలు చెలరేగాయని ప్రయాణికులు కొందరు చెప్పారు. "మంటలు చెలరేగగానే రైలు కిటికీలో నుంచి మేము ఎలాగో బయటపడ్డాము. రైలులో మంటలు ఆర్పేందుకు సరైన వ్యవస్థ లేదు. బోగీ నుంచి బయటకు వచ్చే క్రమంలో కొందరు గాయపడ్డారు" అని ప్రయాణికుడు ఒకరు మీడియాతో చెప్పారు.