ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP election 2022) దృష్ట్యా.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మహిళా ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(UP election priyanka gandhi) పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ అందిస్తామని.. ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రియాంక ప్రకటించారు.
"నా ప్రియమైన ఉత్తర్‌ప్రదేశ్ సోదరీమణులరా.. మీరు రోజూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించింది. మా పార్టీ అధికారంలోకి వస్తే.. ఏడాదికి మూడు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం" అని ప్రియాంక హిందీలో ట్వీట్ చేసింది. వీటితో పాటు మరిన్ని హామీల జాబితాను ఆ ట్వీట్‌కు జోడించారు ప్రియాంక.