తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మార్పుల్లేవ్.. యథాతథంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలు!' - up election cec

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​లో మూడురోజులు పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రణాళిక ప్రకారమే.. ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు తమను కోరాయని చెప్పారు. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

SUSHIL CHANDRA
SUSHIL CHANDRA

By

Published : Dec 30, 2021, 12:42 PM IST

Updated : Dec 30, 2021, 1:51 PM IST

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​లోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు నిర్వహించాలనే తమకు సూచించాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ముందుగా నిర్ణయించిన సమయానికే ఎన్నికలు జరపాలని కోరినట్లు చెప్పారు. ఆ రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటించిన అనంతరం.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. తుది ఓటరు జాబితా జనవరి 5న విడుదల అవుతుందని చెప్పారు.

Sushil Chandra on UP polls

80ఏళ్లు పైబడిన వృద్ధులు, కొవిడ్ బాధితులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సుశీల్ తెలిపారు. ఓటు వేయడానికి రాలేని వారి ఇంటి వద్దకు అధికారులు వెళ్తారని చెప్పారు.

అన్ని పోలింగ్ బూత్​లలో వీవీప్యాట్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారదర్శకత కోసం లక్ష బూత్​ల నుంచి ఓటింగ్ ప్రక్రియను లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుందని వెల్లడించారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న సిబ్బందినే పోలింగ్ బూత్​లలో వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు.

తక్కువ ఓటింగ్ శాతంపై...

రాష్ట్రంలో వరుసగా నమోదవుతున్న ఓటింగ్ శాతంపై ఆందోళన వ్యక్తం చేశారు సుశీల్ చంద్ర. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 61 శాతం, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 59 శాతం ప్రజలు ఓటేశారని చెప్పారు. రాజకీయ అవగాహన అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ఆందోళనకరమని అన్నారు.

వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఈసీ పలు సూచనలు చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని తెలిపింది. ఇక, కొవిడ్‌ బాధితుల కోసం ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సుశిల్‌ చంద్ర తెలిపారు. ఈసీ తాజా ప్రకటనతో యూపీతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.

గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌ శాసనసభల పదవీ కాలాలు వచ్చే మార్చిలో ముగియనున్నాయి. యూపీ అసెంబ్లీ గడువు మే నెల వరకు ఉంది. ఈ ఐదు రాష్ట్రాలకు వచ్చే ఏడాది మార్చి - ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ సన్నాహాలు చేస్తోంది. జనవరిలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:దేశంలో ఒమిక్రాన్ కలవరం... వేగంగా సామాజిక వ్యాప్తి

Last Updated : Dec 30, 2021, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details