UP polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. యువతరాన్ని తమవైపు తిప్పుకునేందుకు కీలక ప్రకటన చేశారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ఐటీ రంగంలో యువతకు 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
లఖ్‌నవూలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు అఖిలేశ్ యావద్.
" మా పార్టీ అధికారంలోకి వచ్చాక నైపుణ్యవంతులైన యువతకు ఐటీ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఐటీ రంగంలో రాష్ట్రం మరింత ముందుకు వెళ్లేందుకు సమాజ్‌వాదీ ప్రభుత్వం కృషి చేసింది. చక్ గజారియా ఫామ్ కోసం హెచ్‌సీఎల్ తొలుత ఇక్కడే పెట్టుబడి పెట్టింది. ఎస్పీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ముందుకు తీసుకెళ్లి ఉంటే లఖ్‌నవూ ఐటీ హబ్‌గా గుర్తింపు పొంది ఉండేది. కానీ, ఏ పని జరగలేదు. హెచ్‌సీఎల్ క్యాంపస్‌లో 5వేల మంది పని చేస్తున్నారు. పలువురు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు."
- అఖిలేశ్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి.