తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్హల్​లో భారీ విజయంపై అఖిలేశ్​​ గురి.. మోదీ-యోగిపైనే బఘేల్ ఆశలు

UP Polls: ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ సీఎం పీఠమెక్కడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. తాను పోటీ చేస్తున్న కర్హల్‌ నియోజకవర్గంలో భారీ విజయంపై కన్నేశారు! అక్కడ రికార్డుస్థాయి మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో సగర్వంగా అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఎస్పీకి పెట్టని కోటగా పేరున్న ఈ స్థానంలో ఆయన విజయం ఖాయమని తొలుత విశ్లేషణలొచ్చాయి. అయితే- భాజపా వ్యూహాత్మకంగా అక్కడ కేంద్రమంత్రి సత్యపాల్‌ సింగ్‌ బఘేల్‌ను బరిలో దించడంతో పోటీ రసవత్తరంగా మారింది!

akhilesh yadav eyeing on thumbing majority in karhal
కర్హల్​లో భారీ విజయంపై అఖిలేశ్​​ గురి

By

Published : Feb 17, 2022, 7:15 AM IST

UP Assembly Elections: ఇటావా జిల్లాలోని సైఫయీ.. అఖిలేశ్‌ స్వగ్రామం. ఆ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కర్హల్‌ (మైన్‌పురీ జిల్లా) ఉంది. అఖిలేశ్‌ తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మైన్‌పురీ నియోజకవర్గం పరిధిలోకి కర్హల్‌ సీటు వస్తుంది. అక్కడి ప్రజలు అఖిలేశ్‌ను స్థానిక బిడ్డగా పరిగణిస్తుంటారు. ఇది ఎస్పీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 1993 నుంచి ఇక్కడ పార్టీ హవా కొనసాగుతోంది. 2002 ఎన్నికల్లో భాజపా తరఫున సోబరన్‌సింగ్‌ యాదవ్‌ ఇక్కడ గెలిచినా.. తర్వాత ఆయన ఎస్పీ గూటికే చేరారు. మైన్‌పురీ మాజీ ఎంపీ తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ ప్రస్తుతం స్థానికంగా అఖిలేశ్‌ తరఫున అన్నీతానై ప్రచార బాధ్యతలు చూసుకుంటున్నారు.

Akhilesh Yadav News

కర్హల్‌ ఓటర్లలో మూడొంతులకుపైగా యాదవులే. శాక్యలు (ఓబీసీ) 34 వేల వరకు, ముస్లింలు దాదాపు 14 వేలమంది ఉన్నారు. వారిలో అత్యధికులు అఖిలేశ్‌ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. తాజా ఎన్నికల్లో ఎస్పీ కూటమి విజయం సాధిస్తే.. అఖిలేశ్‌ సీఎం అవుతారు. అది కూడా ఆయనకు కర్హల్‌లో పెద్ద సానుకూలాంశం. తమ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పీఠంపై ఉంటే నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్న సంగతి స్థానిక ప్రజలకు బాగా తెలుసునని, కాబట్టి వారు ఈ ఎన్నికల్లో ఎస్పీ అధినేత వైపే నిలబడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అఖిలేశ్‌ కనీసం 1.25 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని ఎస్పీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

కర్హల్‌ నియోజకవర్గం

  • మొత్తం ఓటర్ల సంఖ్య 3.7 లక్షలు
  • వారిలో యాదవులు 1.4 లక్షలు
  • పోలింగ్‌ తేదీ: ఫిబ్రవరి 20

కర్హల్‌లో అఖిలేశ్‌కు మద్దతుగా.. కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉంది. అంతగా పేరు లేని కుల్దీప్‌ నారాయణ్‌ను బీఎస్పీ ఇక్కడ బరిలో దించింది.

అఖిలేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి. గతంలో ఎమ్మెల్సీగా ఉండి సీఎం బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.

UP Elections 2022

స్పీ బెల్ట్‌పై సానుకూల ప్రభావం!

ఫిరోజాబాద్‌, ఎటా, కాస్‌గంజ్‌, మైన్‌పురీ, ఇటావా, ఔరైయా, కన్నౌజ్‌, ఫరూఖాబాద్‌ జిల్లాల్లోని 29 అసెంబ్లీ స్థానాలను సమాజ్‌వాదీ బెల్ట్‌గా పరిగణిస్తుంటారు. 2012 ఎన్నికల్లో ఈ బెల్ట్‌లో ఎస్పీ 25 స్థానాలు గెల్చుకుంది. బాబాయి శివపాల్‌సింగ్‌ యాదవ్‌తో అఖిలేశ్‌కు తలెత్తిన విభేదాలు 2017 ఎన్నికల్లో పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ ఎన్నికల్లో కేవలం 6 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బాబాయి-అబ్బాయి తిరిగి ఒక్కటవడంతో మళ్లీ ఈ ఎనిమిది జిల్లాల్లో ఎస్పీ హవా నడుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అఖిలేశ్‌ స్వయంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడంతో ఎస్పీ బెల్ట్‌లో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న సంగతిని వారు గుర్తుచేస్తున్నారు.

బఘేల్‌: నిశ్శబ్ద విప్లవంపై ధీమా

సత్యపాల్‌ సింగ్‌ బఘేల్‌ మాజీ పోలీసు అధికారి. ములాయం సీఎంగా ఉన్నప్పుడు ఆయన భద్రతా బృందంలో విధులు నిర్వర్తించారు. ములాయమే ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో తన విజయంపై బఘేల్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీకి కర్హల్‌ కంచుకోట కాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (అమేఠీలో, 2019 లోక్‌సభ ఎన్నికలు), పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (నందిగ్రామ్‌లో, 2021 అసెంబ్లీ ఎన్నికలు) వంటి వారూ ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతిని గుర్తుచేశారు. కర్హల్‌లో ఫలితం ఏకపక్షంగా ఉండబోదని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల ప్రభపైనే భాజపా ఈ స్థానంలో ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు బఘేల్‌ విజయానికి మెట్లుగా దోహదపడతాయని ఆశిస్తోంది. కర్హల్‌లో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, బఘేల్‌ తప్పకుండా విజయం సాధిస్తారని భాజపా నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎస్పీ పాలన నాటి ‘గూండాల రాజ్యం’ ప్రస్తుతం లేదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యాదవుల్లో అఖిలేశ్‌పై వ్యతిరేకత ఉందని, అది తమకు కలిసొస్తుందని పేర్కొంటున్నారు. అఖిలేశ్‌పై బఘేల్‌ పోటీకి దిగడం ఇది రెండోసారి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఫిరోజాబాద్‌ స్థానంలో ఆయన చేతిలో పరాజయం పాలయ్యారు.

ఇదీ చదవండి:ఒకేసారి 24 మంది భాజపా నేతలకు 'వీఐపీ భద్రత'!

ABOUT THE AUTHOR

...view details