వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి మార్పు, మంత్రివర్గ విస్తరణ వదంతుల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ దిల్లీ సమాలోచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశంలో భాజపా మళ్లీ అధికారంలోకి రావాలంటే 2022లో యూపీలో గెలవడం అత్యంత కీలకం. కానీ అక్కడి రాజకీయ, పాలనా పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో యోగి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ కనిపించింది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీయే అధిక స్థానాలను సొంతం చేసుకుంటుంది. కానీ, భాజపా మూడోవంతు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అధికారులపై ఆధారపడి సీఎం పాలన సాగించడంపట్ల సొంతపార్టీలో వ్యతిరేకత నెలకొంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. యోగిని పదవి నుంచి తప్పిస్తారనే వార్తలు వెల్లువెత్తాయి. అయితే, అదంత తేలిక కాదు.
అధిష్ఠానంతో పెరుగుతున్న దూరం
ప్రధాని మోదీ, యోగిల మధ్య మొదటి నుంచీ అంతగా సఖ్యత లేదు. 1998లో మొదటిసారి యోగి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆ తరవాత 2014 వరకు వరుసగా మొత్తం అయిదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అయినా మోదీ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న మనోజ్‌సిన్హాను 2017లో యూపీ ముఖ్యమంత్రిగా చేయాలని మోదీ ఆశించారు. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో యోగి ఆ పదవిని చేజిక్కించుకున్నారు. ఇటీవలి పరిస్థితులతో యోగి పనితీరు పట్ల అధిష్ఠానంలో అసంతృప్తి పెరిగింది. ప్రధానికి సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ ఐఏఎస్ అధికారి ఎ.కె.శర్మను హడావుడిగా ఎమ్మెల్సీగా చేయడం, యూపీ మంత్రివర్గంలో ఆయనకు కీలక స్థానాన్ని కల్పించాలని అధిష్ఠానం ప్రయత్నించడం తనను అడ్డుకోవడానికేనని యోగి భావిస్తున్నారు.
విషెస్ చెప్పలేదు..
ఏటా జూన్ అయిదో తేదీన యోగి పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ఈసారి మౌనంగా ఉన్నారు. మే చివరి వారంలో దిల్లీలో మోదీ నాయకత్వంలో ఉత్తర్‌ప్రదేశ్ పరిస్థితులపై ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలతోపాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ మాత్రమే పాల్గొన్నారు. యోగికి, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్‌కి ఆహ్వానం అందలేదు. దీనితో యోగి అసంతృప్తికి గురయ్యారని, అందుకే ఆ తరవాత రాష్ట్ర పరిస్థితులపై అంచనా కోసం వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ నేత దత్తాత్రేయ హొసబలేని కలవలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా లేననే సంకేతాలు పంపడానికే యోగి ఇలా చేశారనే వాదనలూ వినిపిస్తున్నాయి.