UP POLICE RAPE: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. నేరాలను అరికట్టాల్సినవారే దారుణాలకు తెగబడుతున్నారు. యూపీలో ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్.. ఆదివారం 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కాస్గంజ్కు చెందిన బాలిక అలీగఢ్ అత్రౌలీలోని తన బంధువుల ఇంటికి రాగా.... వీరి కుటుంబానికి బంధువు అయిన కానిస్టేబుల్.. అప్పుడే వారి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం బాలికను తన బైక్‌పై ఎక్కించుకొని పక్క ఊరికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పరారయ్యాడు.
అయితే, అక్కడి నుంచి బంధువుల ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిందంతా ఇంట్లో వారికి చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించి.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై అలీగఢ్ ఎస్పీ కఠిన చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో.. కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితుడిపై పోక్సో, ఐపీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
UP woman dead police: మరోవైపు, యూపీలోని ఫిరోజాబాద్‌లో ఓ వృద్ధురాలిపై కొందరు పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 60 ఏళ్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలిని రాధా దేవిగా గుర్తించారు. పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించడం వల్లే రాధా దేవి మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భార్య మరణంపై కలత చెందిన దేవి భర్త ఫౌరాన్ సింగ్ సింగ్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు.