భారత 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉగ్ర దాడులకు ఆస్కారం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు ఏకంగా రాజస్థాన్ డీజీపీ మెయిల్ నుంచే బెదిరింపు సందేశం పంపటం కలకలం సృష్టిస్తోంది.
రాష్ట్రంలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందంటూ రాజస్థాన్ డీజీపీ మెయిల్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు సందేశం అందింది. కొందరు ఉగ్రవాదులు యూపీ-రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్నారని అందులో ఉంది. ఉగ్రమూకల సమాచారంతో మెయిల్ వచ్చిన క్రమంలో యూపీ డీజీపీ ముకుల్ గోయల్ అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనుమానితులను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను మోహరించినట్లు చెప్పారు. అలాగే.. హోటళ్లు, ధర్మశాలలు, లాడ్జ్‌లు, మార్కెట్లు, మాల్స్, రద్దీ ప్రదేశాలైనా రైల్వే, మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయం సహా ఇతర ప్రధాన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.
ఈ అంశంపై.. రాజస్థాన్ డీజీపీతో మాట్లాడగా ఆయన ఖండించారు. తాము ఎలాంటి హెచ్చరిక సందేశాలు పంపలేదని స్పష్టం చేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆయన మెయిల్‌ను హ్యాక్ చేసి పంపి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అల్లర్లు సృష్టించేందుకు కుట్ర జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మెయిల్ విషయంపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.
భారీగా బలగాల మోహరింపు..
రాష్ట్రంలో 69 కంపెనీ దళాలను ప్రధాని సంస్థల వద్ద మోహరించినట్లు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మరో 141 అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వారితో పాటు ఎస్డీఆర్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. 550 కిలోమీటర్ల మేర ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా పెంచామన్నారు. దిల్లీ పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని, కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించామన్నారు.