తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బతికుండగానే పెద్దకర్మ చేసుకున్న వృద్ధుడు.. 300మందికి విందు.. వారిపై నమ్మకం లేకే.. - A living person built his own grave

మరణానంతరం పిల్లలు తనకు పెద్దకర్మ కార్యక్రమాన్ని జరిపిస్తారో లేదో అన్న సందేహంతో ఓ వృద్ధుడు తనకు తానుగా ఆ కార్యక్రమం నిర్వహించుకున్నాడు. ఇందుకోసం 300 మందికి సరిపడా ప్రత్యేకంగా విందును కూడా ఏర్పాటు చేశాడు. ఈ వింత సంఘటన ఉత్తర్​ప్రేదేశ్​లోని ఉన్నావ్​ జిల్లాలో జరిగింది.

UP Old Man- Despite being alive, person got his terahvi done, Provided food to 300 people, Know what is reason
బతికేఉన్నాడు అయినా తన పెద్దకర్మ తానే పెట్టుకున్నాడు.. 300 మందికి విందు..

By

Published : Jun 16, 2023, 8:16 PM IST

సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత తిథి ప్రకారం పదిరోజులకో, పదమూడురోజులకో వారికి పెద్దకర్మను నిర్వహిస్తుంటారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మరణించిన వ్యక్తి సంతానం జరిపించాల్సి ఉంటుంది. అయితే ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్​ జిల్లాకు చెందిన ఓ 59 ఏళ్ల వృద్ధుడు మాత్రం బతికుండగానే తన పెద్దకర్మ వేడుకను తానే నిర్వహించుకున్నాడు. తాను చనిపోయిన తర్వాత తన సంతానం దీనిని జరిపిస్తారో లేదో అన్న సందేహంతో తనంతట తానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు. అంతేగాక ఇందుకోసం ప్రత్యేకంగా భోజనాలు వండించి చక్కటి విందును కూడా ఏర్పాటు చేశాడు. 300 మందికిపైగా గ్రామస్థులు ఆ వృద్ధుడి పెద్దకర్మకు హాజరై భోజనాలు చేశారు. వృద్ధుడు చేసిన ఈ పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జఠాశంకర్​ నిర్మించుకున్న సమాధి

3 ఏళ్ల కిందటే సమాధి కూడా..
జిల్లాలోని కెవానా గ్రామానికి చెందిన 59 ఏళ్ల జఠాశంకర్ తాను బతికుండగానే ఎవరూ ఊహించని విధంగా ఈ పెద్దకర్మను నిర్వహించుకున్నాడు. ఈ వృద్ధుడు మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో తనకంటూ ప్రత్యేకంగా ఓ సమాధిని కూడా నిర్మించుకున్నాడట. అంతేగాక చనిపోయాక తనను అదే సమాధిలో పాతిపెట్టమని కుటుంబ సభ్యులను కోరాడట. అయితే కొద్ది వారాల క్రితమే తనకు తాను పిండం పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాడట. ఈ కార్యక్రమం అనంతరం తన పెద్దకర్మ కార్యక్రమానికి రావాల్సిందిగా గ్రామస్థులందరినీ ఆహ్వానించాడు. కాగా, గురువారం రాత్రి జఠాశంకర్​ తన పెద్దకర్మ పూర్తి చేశాడు. ఈ కార్యానికి శంకర్​ బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు అతడు ఆహ్వానించిన గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హాజరయ్యారు. అతడు ఏర్పాటు చేసిన విందును ఆరగించారు.

తన పెద్దకర్మను తానే నిర్వహించుకున్న 59 ఏళ్ల జఠాశంకర్​.

"వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి కుటుంబ సభ్యులు పదమూడవ రోజు కార్యక్రమాన్ని జరిపిస్తారు. కానీ, నేను మాత్రం నేను బతికుండగానే నా పెద్దకర్మ వేడుకను చేసుకోవాలని నిర్ణయించుకున్నా. మరణానికి ముందు ఈ కార్యక్రమం చేయడం మన ఆచారాల్లో భాగం కాదు.. అయినా నేను నిర్వహించుకున్నా. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను."
-జఠాశంకర్​, పెద్దకర్మను నిర్వహించుకున్న వృద్ధుడు

'నాకు 7మంది పిల్లలు.. వారిపై నమ్మకం లేదు!'
59 ఏళ్ల జఠాశంకర్​ ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇతడికి ఏడుగురు సంతానం ఉన్నారు. అయితే తాను చనిపోయాక తన పెద్దకర్మ కార్యక్రమాన్ని తన పిల్లలు, కుటుంబ సభ్యులు జరిపిస్తారో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకోసం వారిపై ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదని చెప్పాడు. అందుకనే తాను బతికి ఉన్నప్పుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని చెబుతున్నాడు శంకర్​. కాగా, ఈ కార్యానికి జఠాశంకర్​ కుటుంబీకులు, బంధువులు అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details