ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అన్నయ్యతో హలాలాకు నిరాకరించిందని మాజీ భార్యపై యాసిడ్ దాడి చేశాడు ఓ భర్త. ముఖంపై తీవ్రగాయాలతో విలవిలలాడిన ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఏం జరిగిందంటే..బరేలీ జిల్లాకు చెందిన ఇషాక్.. 11 ఏళ్ల క్రితం నస్రీన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇటీవలే అతడి చిన్న కుమార్తెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ విషయంలో భార్యభర్తలిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న అతడు తన భార్యకు ముమ్మారు తలాక్ చెప్పాడు. వెంటనే బాధితురాలు తన కన్నవారింటికి వెళ్లిపోయింది. కానీ, భర్తపై ఎలాంటి కేసులు పెట్టలేదు. అదే అదనుగా భావించిన ఇషాక్.. మళ్లీ నస్రీన్‌ను భార్యగా స్వీకరిస్తానని సందేశాలు పంపాడు. కానీ, ఓ షరతు పెట్టాడు. మళ్లీ తనతో కలిసి జీవించాలంటే తన అన్నయ్యతో హలాలా చేసుకోవాలని తెలిపాడు. అందుకు బాధితురాలు అంగీకరించలేదు.
ఇటీవలే ఆమెను కలవడానికి వెళ్లిన ఇషాక్.. తన అన్నయ్యతో హలాలా విషయంపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె పూర్తిగా నిరాకరించడం వల్ల.. వెంటనే ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. తీవ్ర గాయాలపాలైన నస్రీన్‌ను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేశామని బరేలీ ఎస్ఐ సత్యార్థ్ అనురుద్ధ తెలిపారు.
హలాలా అంటే ఏంటి?..విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళ మళ్లీ భర్తను పెళ్లి చేసుకోవాలంటే ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అతడికి విడాకులు ఇవ్వడమో లేదంటే అతడు మరణించే వరకు ఉండడమో చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆమె మళ్లీ తన భర్తను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కిడ్నాప్ చేసి విద్యార్థినిపై అత్యాచారం.. త్రిపురలో ఓ 21 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకునేందుకు గాలిస్తున్నామని చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెపాహిజాలా జిల్లాలోని మేలగర్కు చెందిన బాధితురాలు పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వస్తోంది. అదే సమయంలో ముగ్గురు యువకులు కలిసి బాధితురాల్ని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి హద్రా ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లాక యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు.