mother takes to hospital on handcart: అనారోగ్యంతో ఉన్న తల్లిని బతికించుకునేందుకు ఆ తనయుడు పడ్డ తాపత్రయం వృథాగా మిగిలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాలాబాద్ పట్టణానికి చెందిన బీనాదేవి (65) బుధవారం ఉదయం ఉన్నఫళంగా వచ్చిన కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయారు. అంబులెన్సు కోసం ఫోను చేసి, ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తోపుడుబండిపై తల్లిని పడుకోబెట్టి, నాలుగు కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు దినేశ్ (45) పరుగు తీశాడు. విధి నిర్ణయం ఆ నిరుపేద కుటుంబానికి విషాదమే మిగిల్చింది. బీనాదేవిని పరీక్షించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమిత్ యాదవ్ ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. సకాలంలో తల్లికి వైద్యసేవలు అందనందుకు చింతిస్తూ మళ్లీ అదే బండిపై ఆమె మృతదేహంతో దినేశ్ ఇంటిముఖం పట్టాడు.
అయితే, ఈ విషయంపై చనిపోయిన మహిళ కుటుంబసభ్యుల నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని అంబులెన్సు సర్వీసుల ప్రోగ్రాం అధికారి తెలిపారు. తాను పరీక్షించేందుకు వెళ్లేసరికే ఆమె మరణించిందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ అమిత్ యాదవ్ చెప్పారు. ఈ విషయంపై స్పందించిన షాజహాన్‌పుర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పీకే వర్మ.. వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని అన్నారు. కాల్ చేసిన 30 నిముషాల్లో అంబులెన్స్ చేరుకోవాలని, దూరం తక్కువైతే మరింత తొందరగా చేరుకోవాలన్నారు. తాజాగా ఇటువంటి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పథక్ దర్యాప్తునకు ఆదేశించారు. సంబంధిత అధికారులను వివరణ కోరారు. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.