ఉత్తర్ప్రదేశ్వ్యాప్తంగా మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడిన రాకేశ్ కుమార్ అనే వ్యక్తిని 66 ఫిర్యాదుల తర్వాత ఎట్టకేలకు అరెస్టు చేశారు పోలీసులు. ఔరైయా జిల్లాకు చెందిన 51 ఏళ్ల నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు, పలు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతడికి పెళ్లైన ముగ్గురు కొడుకులున్నారు.
నిందితుడిపై ఉమెన్ పవర్ లైన్‌కు మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడి చాలామంది మహిళలు పోలీసులను ఆశ్రయించలేకపోతున్నారని సమాచారం.
"ఇష్టమొచ్చిన ఏదో ఒక ఫోన్ నంబర్‌కు నిందితుడు కాల్ చేసేవాడని తెలుస్తోంది. అటువైపు ఎవరైనా మహిళలు గానీ, బాలికలు గానీ స్పందిస్తే వారి నంబర్‌ను సేవ్ చేసుకునేవాడు. తర్వాత వారికి పదేపదే ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం, సందేశాలు పంపడం, అశ్లీల పాటలు వినాలని బలవంతం లాంటివి చేసేవాడు. 100 మందికి పైగా ఆడవాళ్లతో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు దర్యాప్తులో అంగీకరించాడు. అతడి ఫోన్లో 200కు పైగా మహిళల ఫోన్ నంబర్లున్నాయి. 2018 నుంచి నిందితుడు ఈ తరహా వేధింపులకు పాల్పడుతున్నాడు. తొలుత ఉమెన్ పవర్ లైన్ కౌన్సెలింగ్ ఇచ్చినా అతడి వైఖరి మారలేదు."