తెలంగాణ

telangana

కాంగ్రెస్‌లో వలస వేదన- ప్రియాంకా గాంధీకి కఠిన పరీక్ష

By

Published : Jan 30, 2022, 6:57 AM IST

Leaders leaving congress: సంక్షోభంలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మరింత జఠిలమవుతున్నాయి. భారీ సంఖ్యలో నేతలు పార్టీని వీడుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. వలసలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆ రాష్ట్రానికి ఎన్నికల ఇంఛార్జిగా ఉన్న ప్రియాంకా గాంధీకి ఇదే కఠిన పరీక్ష అని విశ్లేషకులు చెబుతున్నారు.

congress leaders quitting party
congress leaders quitting party

Leaders leaving congress: కాంగ్రెస్‌ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్న నాయకుల్లో పశ్చిమ యూపీలోని పౌడ్రానా నియోజకవర్గంలో రాజా సాహెబ్‌గా పిలుచుకొనే ఆర్పీఎన్‌ సింగ్‌ కూడా చేరారు. కాంగ్రెస్‌ తన విధానాల నుంచి.. పక్కతోవ పట్టిందని అందుకే.. పార్టీని వీడుతున్నానని ఆయన చెప్పారు. ఇటీవల బ్రాహ్మణ వర్గానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జితిన్‌ ప్రసాద కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ సర్కారులో మంత్రి కూడా అయ్యారు.

Congress crisis

UP assembly election 2022

ఓబీసీ వర్గానికి చెందిన ఆర్పీఎన్‌ సింగ్‌, జితిన్‌ ప్రసాదలిద్దరు కాంగ్రెస్‌లోని గాంధీ కుటుంబానికి, ముఖ్యంగా రాహుల్‌, ప్రియాంకా గాంధీకి సన్నిహితులని పేరు. ఈ ఇద్దరు ప్రముఖ నేతలే కాదు.. గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే రాయబరేలిలోని హరచంద్‌పుర్‌, రాయబరేలి సదర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేలు రాకేశ్‌ సింగ్‌, అదితి సింగ్‌ కూడా పార్టీకి వీడ్కోలు పలికారు. రాకేశ్‌ సింగ్‌ సోదరుడు మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ కూడా వారి బాటలోనే నడిచారు. బెహట్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నరేశ్‌ సైనీని, పార్టీ 'లఢఖీ హూ' ప్రచార కార్యక్రమ గోడపత్రికల్లో ప్రముఖంగా కనిపించిన పూర్ణిమ మౌర్యను కూడా భాజపా తన బుట్టలో వేసుకుంది. ఈ వలసల పర్వం ఇంతటితో ఆగేలా లేదు. యూపీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు రాజ్‌బబ్బర్‌, ఆయన కుమార్తె కూడా త్వరలోనే పార్టీ వీడనున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రియాంక ఎదురీదగలదా

Priyanka Gandhi UP election:యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌లో బలమైన ఓబీసీ నేతైన స్వామి ప్రసాద్‌ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలోకి చేరిన సమయంలో ఓబీసీకే చెందిన ఆర్పీఎన్‌ సింగ్‌ చేరిక భాజపాకు బలాన్నిచ్చేదే అనడంలో సందేహం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సింగ్‌ పోటీ చేస్తారా, లేక 2024 లోక్‌సభ ఎన్నికల వరకు వేచి చూస్తారా అన్న విషయంలో స్పష్టత రాలేదు. ఆర్పీఎన్‌ తాజా ఎన్నికల రికార్డైతే అంత ఘనంగా లేదు. 2014,19 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లోనైతే డిపాజిట్‌ కూడా దక్కలేదు. అయితే భారీ సంఖ్యలో నాయకులు పార్టీని వీడటం ప్రియాంకా గాంధీకి ఎదురుదెబ్బే. తొలిసారి ఆమె యూపీ ఎన్నికల యుద్ధాన్ని తన భుజాలపై వేసుకున్నారు. చాలా అంచనాలు ఆమెపై ఉన్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ ప్రదర్శనకు జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. సోదరుడు(రాహుల్‌)-సోదరి(ప్రియాంక) ద్వయం పార్టీని నడపగలదా లేదా అన్న సందేహాలను కాంగ్రెస్‌లోనే కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వలసల ప్రభావం ప్రియాంకపై పెద్దగా పడినట్లు లేదు. ప్రియాంకా గాంధీ బలమైన సైద్ధాంతిక యుద్ధం చేస్తున్నారని.. పోరాడలేని పిరికిపందలే పార్టీని వీడిపోతున్నారని ఆర్పీఎన్‌ సింగ్‌ పార్టీని వీడిన తర్వాత..కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

ఆ ఏడింటినైనా రక్షించుకోగలదా

UP election Congress winning chances: ప్రధానంగా కులం, మతం ఆధారంగా రాజకీయాలు జరిగే యూపీలో ప్రియాంక.. మహిళలకు 40 శాతం ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం పెద్ద జూదమే. దీనిపై ఆమె భవిష్యత్తే కాదు.. పార్టీదీ ఆధారపడి ఉంది. 30 ఏళ్ల నుంచి యూపీలో కాంగ్రెస్‌ అధికారానికి దూరంగా ఉంది. గణాంకాలు ఆ పార్టీకి అనుకూలంగా లేవు. 2012లో 28 అసెంబ్లీ సీట్లు నెగ్గిన కాంగ్రెస్‌ 2017లో ఏడుకు పరిమితమైంది. ఇప్పుడు ఈ వలసల మధ్య ఆ ఏడు సీట్లను రక్షించుకోవటానికి పోరాడుతోంది. ఆసక్తికరమేంటంటే..చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు కాషాయ పార్టీలోకి చేరుతుండడంతో యూపీ ఎన్నికలు ఇప్పుడు ఎస్పీ.. కాంగ్రెస్‌ యుక్త్‌ (కూడిన) భాజపా మధ్య పోరాటంగా మారాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:UP polls 2022: యూపీ సమరంలో మానసిక యుద్ధం

ABOUT THE AUTHOR

...view details