ఉత్తర్ప్రదేశ్ లలిత్పుర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై.. కొంతమంది కిరాతకులు క్రూరత్వానికి పాల్పడ్డారు. వేడి చేసిన కత్తితో తన కళ్లపై కాల్చారు.
అసలేం జరిగింది?
లలిత్పుర్ జిల్లాలోని బార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన హిమాన్షు, గంగారామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి యత్నించారు.
అయితే.. సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నిందితులు.. లైటర్ వెలిగించి, కత్తిని వేడి చేసి, మహిళ కళ్లపై కాల్చారు. ఆ బాధతో ఆమె రోదిస్తున్న క్రమంలో.. తీవ్రంగా కొట్టారని బాధితురాలు తెలిపింది. అనంతరం తాను స్పృహ కోల్పాయానని చెప్పింది.