ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్.. సోమవారం తెల్లవారుజామున ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా అన్నదాతలను కలిసి వారితో మాట్లాడతామని టికాయిత్ చెప్పారు. గ్రామస్థులు, రైతులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.
మరోవైపు, హింస నేపథ్యంలో జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నలుగురి కన్నా ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో గుమిగూడకుండా ఆంక్షలు విధించారు.
ఎనిమిది మంది మృతి
యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్ ఖేరీలో హింస చెలరేగింది. టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు దాడి చేయడం వల్ల ఓ కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. నిరసనకారులు రెండు కార్లను తగలబెట్టారు. ఘటన సమయంలో తమ కుమారుడు వాహనంలో లేడని, అక్కడ ఉన్నవారే భాజపా కార్యకర్తలను, కారు డ్రైవరును కొట్టి చంపారని అజయ్ మిశ్ర ఆరోపించారు.
దేశవ్యాప్త ఆందోళన
ఈ ఘటనపై రైతు సంఘాలు మండిపడ్డాయి. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి 01:00 గంట మధ్య ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.