cotton left in patient stomach: ఉత్తర్ప్రదేశ్లో ఓ వైద్యురాలి నిర్లక్ష్యంపై ఆ రాష్ట్ర వివాద పరిష్కారాల కమిషన్ కొరడా ఝుళిపించింది. ఓ మహిళకు ఆపరేషన్ చేస్తూ.. పొట్టలో కాటన్ను వదిలిపెట్టిన ఘటనపై సీరియస్ అయింది. బాధితురాలికి రూ.45.39 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వైద్యురాలిని ఆదేశించింది.
అసలేమైందంటే?:జుడాచ్ప్రాలోని నిర్మల్ పత్తి గ్రామంలో నివాసముండే వినోద్ శర్మ భార్య సుశీలా శర్మ.. తొలి కాన్పు కోసం పద్రౌనా నగర్లోని శ్రీజన్ ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రికి చెందిన వైద్యురాలు డా.అమృతా రాయ్ సుశీలకు ప్రసవం చేశారు. 2020 మే 25న ఆపరేషన్ జరిగింది. పండంటి బిడ్డకు సుశీల జన్మనిచ్చింది. చికిత్స కోసం రూ.40 వేలు ఖర్చయ్యాయి. మే 31న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
Consumer court punishment doctor:అయితే, ఇంటికి వచ్చిన తర్వాత కడుపు నొప్పి ప్రారంభమైంది. క్రమంగా ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో జూన్ 5న ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకుంది. అక్కడి డాక్టర్.. గోరఖ్పుర్ సావిత్రి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో గోరఖ్పుర్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది సుశీల. దీంతో అసలు విషయం బయటపడింది. పొట్టలో కాటన్ ప్యాడ్ ఉండిపోయిందని వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించి కాటన్ను తొలగించారు. ఈ క్రమంలో సుశీల చావు అంచు వరకు వెళ్లింది. కోలుకున్న తర్వాత.. తనకు ప్రసవం చేసిన వైద్యురాలిపై జిల్లా వివాద పరిష్కార కమిషన్లో కేసు దాఖలు చేసింది. రూ.15.39 లక్షల పరిహారం అందజేయాలని కోరింది. విచారణ జరిపిన కమిషన్.. లేడీ డాక్టర్ను దోషిగా తేల్చి రూ.4 లక్షలు జరిమానా విధించింది. ఈ మొత్తం రెండు నెలల్లోగా చెల్లించకపోతే.. 6 శాతం వడ్డీ పడుతుందని హెచ్చరించింది.
కాగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ను ఆశ్రయించింది వైద్యురాలు. అయితే, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. కేసుపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల బెంచ్.. తీవ్రమైన ఈ నిర్లక్ష్యం కేసులో నిందితురాలికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. బాధితురాలు కోరిన రూ.15.39లక్షలకు మరో రూ.30 లక్షలు జత చేసి పరిహారంగా ఇవ్వాలని వైద్యురాలిని ఆదేశించింది. ఈ పరిహారానికి 2020 డిసెంబర్ 1 నుంచి 10 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని స్పష్టం చేసింది. 60 రోజుల్లోగా పరిహారం చెల్లించకపోతే.. 15 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి:ఇంజినీరింగ్లో ప్లంబింగ్ కోర్సు.. ఏఐసీటీఈ కీలక నిర్ణయం