ఉత్తర్ప్రదేశ్లో విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టనుంది అక్కడి యోగి (Yogi Adityanath News) సర్కార్. బేసిక్ శిక్షా పరిషద్ (Basic Shiksha Parishad UP) కింద పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించనుంది. విద్యార్థుల కనీస ఖర్చులను తీర్చేలా.. రూ.1,100ను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. దీని వల్ల 1.80 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది.
స్కూల్ యూనిఫాంలు, షూలు, సాక్సులు, బ్యాగులు, స్వెటర్లు కొనుక్కునేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని యూపీ విద్యా శాఖ మంత్రి సతీశ్ ద్వివేది వెల్లడించారు.
మెడికల్ కాలేజీల నిర్మాణం
మరోవైపు, శనివారం ఔరైయాలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రూ.280 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు రూ.109 కోట్ల విలువ చేసే 12 అభివృద్ధి కార్యక్రమాలకూ శంకుస్థాపన చేశారు.
మెడికల్ కాలేజీకి శంకుస్థాపన అనంతరం మాట్లాడిన యోగి.. గతంలో ఆస్పత్రులకు అంబులెన్సుల కొరత ఉండేదని, తమ ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాలో 4-6 అంబులెన్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. 2017కు ముందు రాష్ట్రంలో 12 వైద్యకళాశాలలు (UP Medical college list) మాత్రమే ఉండేవని చెప్పారు. ఇప్పుడు.. 75 జిల్లాల్లో ఒక్కో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
ఇదీ చదవండి:''రివర్స్ గేర్'లో మోదీ అభివృద్ధి వాహనం'