ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మేరఠ్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఓ హత్య కేసులో జైలులో ఉన్న అనిల్.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడని.. అనంతరం తనపై ఉన్న కేసుల్లోని సాక్షులను బెదిరించాడని పోలీసులు తెలిపారు. దీంతో అతడిని అరెస్టు చేయడానికి వెళ్లిన ఎస్టీఎఫ్ పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరపగా.. గ్యాంగ్‌స్టర్ అనిల్ మృతిచెందాడు. అనిల్ దుజానాపై 18 హత్య కేసులతో పాటు మొత్తం 62 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
అనిల్ తన గ్యాంగ్ సభ్యులను కలవడానికి మేరఠ్‌లోని ఓ గ్రామానికి వెళ్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఫాలో అయ్యారు. పోలీసులను గమనించిన అనిల్.. తాను ప్రయాణిస్తున్న ఎస్యూవీ వేగం పెంచాడు. అనంతరం ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో యూపీ ఎస్టీఎఫ్ అడిషనల్ ఎస్పీ బ్రిజేశ్ సింగ్ నేతృత్వంలోని బృందం అతడిని చుట్టుముట్టింది. పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు నేరస్థుడు అనిల్. ఆ తర్వాత పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగగా.. అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలం నుంచి రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కారులో అనిల్ ఒక్కడే వచ్చాడా? లేక.. తన గ్యాంగ్ సభ్యులెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.