మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో నలుగురు సాధువులపై దారుణంగా దాడి చేశారు గ్రామస్థులు. పండరీపురం పుణ్యక్షేత్రానికి కారులో వెళ్తున్న సాధువులను పిల్లలను ఎత్తుకుపోయిన ముఠాగా అనుమానించి కర్రలతో కొట్టారు.
సాధువులపై గ్రామస్థుల మూకదాడి.. పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా అని భావించి.. - ఉత్తర్‌ప్రదేశ్ మధుర సాధువులు
దైవ దర్శనానికి వెళ్తున్న నలుగురు సాధువులను.. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా అనుమానించిన గ్రామస్థులు చితకబాదారు. కారులో నుంచి దించి మరీ దారుణంగా కర్రలతో కొట్టారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నలుగురు సాధువులు.. కర్ణాటకలోని బీజాపుర్కు వెళ్లి.. అక్కడి నుంచి పండరీపురానికి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని లవంగా గ్రామానికి చెందిన ఓ పిల్లవాడ్ని రహదారి గురించి ఆరా తీశారు సాధువులు. అయితే వీరిపై గ్రామస్థులకు అనుమానం వచ్చి పలు ప్రశ్నలు అడిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నలుగురు సాధువులను పిల్లలు ఎత్తుకుపోయే ముఠాగా అనుమానించి.. స్థానికులంతా కలిసి కర్రలతో దాడికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. సాధువులను వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తరలించి సమగ్ర విచారణ చేపట్టారు. ఆ తర్వాత వారు నిజమైన సాధువులేనని తేల్చారు. వీరంతా మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందిన సాధువులని పోలీసులు వెల్లడించారు. తమను గ్రామస్థులు అపార్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులకు సాధువులు తెలిపారు. తాము కూడా అవగాహన లోపం వల్లే దాడి చేశామని గ్రామ ప్రజలు చెప్పారు. అయితే ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.