UP Elections 2022: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తాజాగా మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ వివిధ వర్గాల మధ్య విద్వేష బీజాలు నాటుతోందని ఆరోపించారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కంటే కాషాయ పార్టీని వదిలించుకోవడమే పెద్దదని వ్యాఖ్యానించారు. భాజపా హయాంలో జమ్ముకశ్మీర్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని వాపోయారు. అయితే, యువత మాత్రం అధికార పార్టీ బెదిరింపులకు వెనకడుగు వేయకుండా.. అహింసాయుతంగా, ప్రేమ, స్నేహా సందేశాలను చాటుతూ దేశ సవాళ్లకు దీటుగా నిలబడాలని కోరారు. పీడీపీ ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా నిర్వహించిన గిరిజన యువజన సదస్సులో ముఫ్తీ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు.
'భాజపా నేతలు దేశాన్ని నాశనం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఈడీ, ఇతర ప్రభుత్వ సంస్థల దాడులు, అరెస్టులు నిత్యకృత్యంగా మారాయి. కశ్మీర్ పరిస్థితి దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దారుణంగా మారింది. కానీ, గుర్తుంచుకోండి.. చరిత్ర అందరికీ ఓ అవకాశాన్ని ఇస్తుంది. బ్రిటీషర్ల నుంచి విముక్తి కోసం దేశ ప్రజలు గతంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు భాజపాను వదిలించుకునేందుకు అవకాశం ఉంది. ఇది స్వాతంత్య్రం కంటే పెద్దది.. ఎందుకంటే ఈ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోంది' అని అన్నారు.