UP Election Result 2022: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ఎలక్షన్ కమిషన్ అధికారులు ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అయోధ్యలో తమ పార్టీ విజయం సాధిస్తుందని భాజపా భయపడుతోందని అన్నారు. వారణాసిలో స్థానిక అభ్యర్థులకు సమాచారం లేకుండానే ఈవీఎంలను రవాణా చేశారని ఆరోపించారు.
"ప్రజాస్వామ్యానికి ఇదే చివరి పోరు.. అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండానే ఈవీఎంలు రవాణా చేస్తున్నారు. ఇది దొంగతనం.. మన ఓట్లను కాపాడుకోవాలి. మనం కోర్టుకు వెళ్లవచ్చు కానీ అంతకంటే ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను."
- అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్
ఓట్ల లెక్కింపు సమయంలో మోసాలకు పాల్పడితే ఎదుర్కొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ, మిత్రపక్షాల అభ్యర్థులు తమ కెమెరాలతో సిద్ధంగా ఉండాలని అఖిలేష్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం కోసం కౌంటింగ్ సమయంలో యువత సైనికులుగా మారాలని కోరారు. ఉత్తర్ప్రదేశ్లో ఏడో, చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. రాష్ట్రంలో భాజపాకే మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.