UP election Hindu Yuva Vahini: హిందూ యువ వాహిని.. యువతలో జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్‌పుర్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన సంస్థ. గత కొన్నేళ్లుగా ఇది నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా క్రియాశీలంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలపై దృష్టిసారించింది. వ్యవస్థాపకుడు యోగి తరఫున ప్రచారం చేస్తోంది.
Yogi Adityanath Hindu Yuva Vahini
గోరఖ్‌పుర్ పట్టణ నియోజకవర్గం అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ పేరును భాజపా ప్రకటించగానే ఈ యువ వాహిని సభ్యులంతా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. బూత్ స్థాయిలో యోగికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక భాజపా నేతలతో కలిసి పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ యోగికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు.
UP assembly election 2022
2002లో యోగి ఆదిత్యనాథ్ ఈ సంస్థను ప్రారంభించారు. భాజపాతో విభేదించి దీన్ని ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా గోరఖ్‌పుర్‌లోని యువతపై ఇది ఎక్కువగా ప్రభావం చూపింది. పెద్ద సంఖ్యలో యువత ఇందులో భాగమయ్యారు.
యోగి నేతృత్వంలో హిందూ యువ వాహిని అత్యంత శక్తిమంతమైన సంస్థగా ఎదిగింది. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లను యోగికి అనుకూలంగా మార్చడంలో విశేషంగా తోడ్పడింది. భాజపాపై పోటీ చేసిన తన అనుచరులను గెలిపించుకోవడానికి హిందూ వాహిని అసమానంగా ఉపయోగపడింది.
భాజపాను ఢీకొట్టి...
Yogi adityanath vs BJP 2002:
2002లో భాజపాతో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు తన సత్తాను హిందూ వాహిని ద్వారా నిరూపించుకున్నారు యోగి ఆదిత్యనాథ్. గోరఖ్‌పుర్ సిటీ, పిప్రాయిచ్, ముండేరా నియోజకవర్గాల నుంచి అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫున అభ్యర్థులను దించారు. గోరఖ్‌పుర్ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన అప్పటి కేబినెట్ మంత్రి, భాజపా నేత శివ్ ప్రతాప్ శుక్లాను ఎన్నికల్లో గట్టిదెబ్బ కొట్టారు. మహాసభ నుంచి పోటీ చేసిన రాధామోహన్ దాస్ అగర్వాల్.. ఘన విజయం సాధించారు. యోగి హవాకు.. శివ్ ప్రతాప్ శుక్లా ఓట్ల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. యోగి వ్యూహాలు, హిందూ వాహిని క్షేత్రస్థాయి పనితీరు ఇందుకు ప్రధాన కారణం.
పిప్రాయిచ్లో మహాసభ అభ్యర్థి దీపక్ అగర్వాల్.. భాజపా మద్దతిచ్చిన అభ్యర్థి జితేంద్ర జైస్వాల్‌కు గట్టిపోటీ ఇచ్చారు. అయితే, రెండో స్థానానికి పరిమితమయ్యారు. ముండేరాలో మాత్రం మహాసభ అభ్యర్థి బేచన్ రామ్ ఐదో స్థానంలో నిలిచారు. మొత్తంగా గోరఖ్‌పుర్‌లో భాజపాపై యోగి ప్రభావం గట్టిగానే పడింది. ఈ సంస్థ క్రమంగా బలపడింది. 1998 నుంచి గోరఖ్‌పుర్ నియోజకవర్గం ఎంపీగా గెలుస్తూ వస్తున్న యోగి.. 2002 తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో అగ్రశ్రేణి హిందుత్వ నేతగా ఎదిగారు.
సీఎం అయిన తర్వాత...
అయితే, 2017 తర్వాత హిందూ వాహిని.. మెతక వైఖరే అవలంబించిందన్నది విశ్లేషకుల మాట. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఈ సంస్థ రాజకీయాల కంటే సామాజిక కార్యక్రమాలపైనే దృష్టిపెట్టిందని చెబుతారు. అంటరానితనాన్ని రూపుమాపి, హిందువుల మధ్య వివక్ష లేకుండా చూసేందుకు ప్రయత్నించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలోనూ వీరు స్థానిక పౌరులకు తమ సేవలు అందించారు.