తెలంగాణ

telangana

ETV Bharat / bharat

UP Election 2022: మజ్లిస్‌తో ఎవరికి నష్టం? ఏ పార్టీకి మేలు? - ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తాజా సమాచారం

UP Election 2022: 2017లో జరిగిన యూపీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న మజ్లిస్​ (ఏఐఎంఐఎం) పార్టీ.. మళ్లీ బరిలోకి దిగుతోంది. ఈసారి ఉనికి చాటుతుందా? లేదా బిహార్‌ ఫలితాలను పునరావృతం చేస్తుందా? అన్నది యూపీ రాజకీయ వర్గాల్లో చర్చలకు తోవిస్తోంది. గతంలో బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల భాజపాకు మేలు జరిగినట్లు విశ్లేషణలు ఉన్నాయి. దీంతో యూపీ ఎన్నికల్లో ఈ పార్టీ ఎవరి ఓట్లును చీలుస్తుంది? ఏ పార్టీకి మేలు చేస్తుంది? అనేది కూడా కీలక అంశంగా మారింది.

UP Election 2022
UP Election 2022

By

Published : Feb 11, 2022, 8:14 AM IST

UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుంది? అది ఏ పార్టీకి మేలు చేస్తుంది?.. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. గతంలో బిహార్‌లో ఎంఐఎం పోటీ చేసినప్పుడు ఓట్ల చీలిక తలెత్తి, భాజపాకే మేలు చేసిందన్న విశ్లేషణలు ఉన్నాయి. యూపీలోనూ అది పునరావృతమవుతుందా, లేదంటే ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో మజ్లిస్‌ హవా చాటుతుందా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. యూపీలో రమారమి 100 సీట్లపై ఈ పార్టీ గురిపెట్టింది. 65 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా వారిలో ఎనిమిది మంది హిందువులు. మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దళిత హిందూ ఓటర్లపైనా దృష్టి సారించారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న ఆయన- యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నా ఉత్తర్‌ప్రదేశ్‌పై దృష్టంతా పెట్టారు. చిరకాల ప్రత్యర్థి భాజపాను ఇక్కడ గద్దె దింపి, 2024 ఎన్నికల్లో కాషాయ పార్టీని బలహీనపరచాలన్న లక్ష్యం దీనికి కారణం. అందుకే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనూ కాళ్లకు చక్రాలు కట్టుకొని యూపీ- దిల్లీ మధ్య తిరుగుతున్నారు.

సీఎం అభ్యర్థి కుశ్వాహా

2017లో యూపీలో మజ్లిస్‌ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు స్థానిక పార్టీలతో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. భారత్‌ ముక్తి మోర్చా అధినేత, యూపీ మాజీ మంత్రి బాబు సింగ్‌ కుశ్వాహాయే తమ కూటమి మొదటి సీఎం అభ్యర్థి అని ఆయన ప్రకటించారు. తమ కూటమి గెలిస్తే ఓబీసీల నుంచి ఒకరు, దళిత వర్గానికి చెందిన మరొకరు సీఎం అవుతారని ఆయన ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఇది ఎలా సాధ్యమనేది ఆయన స్పష్టతనివ్వలేదు. ఎస్పీ, లేదా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకున్నప్పటికీ ఆ చర్చలు ముందుకు సాగలేదు. దీంతో చిన్న పార్టీలతో జట్టు కట్టారు. కొద్దిశాతం మంది ముస్లింలు ఒవైసీ వైపు మొగ్గినా ఎన్నికల ఫలితాల్లో పెనుమార్పులు తప్పవని రాజకీయ విశ్లేషకుల అంచనా. 140కు పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే సామర్థ్యం ముస్లింలకు ఉందని వారి లెక్కలు చెబుతున్నాయి. ఉన్నావ్‌ ఘటన, రైతుల ఉద్యమం, లఖింపుర్‌ ఖేరీ అంశాలను ప్రచారాస్త్రాలుగా మలచుకుంది.

సమాజ్‌వాదీలో కలవరం

యూపీ ఓటర్లలో 20శాతం ముస్లింలున్నారు. సంభాల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో వీరు 75శాతం ఉంటారని అంచనా. మొరాదాబాద్‌, రాంపుర్‌ వంటి నియోజకవర్గాల్లో సగంమంది ఓటర్లు ముస్లింలే. ఇవన్నీ ఇప్పటివరకు సమాజ్‌వాదీకి కంచుకోటలు. ముస్లింలను, యాదవులను అండగా మలచుకున్న ఎస్పీకి ఇప్పుడు ఒవైసీ పార్టీ సెగ ఎంతవరకు తగులుతుందో తేలాల్సి ఉంది. ఓట్లు చీలితే భాజపా ప్రయోజనం పొందుతుందన్న అంచనాలూ ఉన్నాయి. మజ్లిస్‌, బీఎస్పీలకు లభించే ఓట్ల గురించి భాజపా కంటే సమాజ్‌వాదీలోనే ఎక్కువ కలవరం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి:''యూపీ కేరళలా మారితే..' యోగి భయమంతా అందుకే..!'

ABOUT THE AUTHOR

...view details