తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆచితూచి లౌకిక గళం.. యూపీలో 'సాఫ్ట్‌ హిందుత్వం'! - ఉత్తర్​ప్రదేశ్ సాఫ్ట్ హిందుత్వ

Soft hindutva strategy UP: ఉత్తర్​ప్రదేశ్​లో లౌకిక పార్టీలు సాఫ్ట్ హిందుత్వ వైఖరి అవలంబిస్తున్నాయి. హిందువులను ఆకర్షిస్తూనే, ముస్లిం ఓటర్లు చేజారకుండా జాగ్రత్తపడుతున్నాయి. హిందుత్వంపై భాజపా దూకుడును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

UP CONGRESS SP HINDU
up soft hindutva politics

By

Published : Jan 23, 2022, 6:56 AM IST

Soft hindutva strategy UP: కులమతాల ప్రాతిపదికన ఓటర్లు చీలిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం లౌకికవాద పార్టీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది! 'హిందుత్వం' విషయంలో అవి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. హిందువులను ఆకర్షిస్తూనే.. రాష్ట్రంలో దాదాపు 19%గా ఉన్న ముస్లిం ఓటర్లు తమ చేజారిపోకుండా రక్షించుకునేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. హిందుత్వంపై భాజపా దూకుడును ఎదుర్కొనేందుకు సాఫ్ట్‌ హిందుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి.

UP soft hindutva politics

భాజపా... యోగి దూకుడు

BJP Hindutva politics: హిందువులకు ముఖ్యమైన అయోధ్య, మథుర, కాశీ వంటి నగరాలు యూపీలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయాలు హిందుత్వం చుట్టూ తిరుగుతుంటాయి. ఈ దఫా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. 2017లో రాష్ట్రంలో ఘన విజయం సాధించిన అనంతరం.. హిందుత్వ దిగ్గజంగా పేరున్న యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పీఠంపై భాజపా కూర్చోబెట్టింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి ఆయన 36 సార్లు అయోధ్యను సందర్శించారు. కొందరు ముస్లింలు గోవధతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ యోగి పలుమార్లు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలకు ముస్లిం సంబంధిత పేర్లను తొలగించారు. ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరును అయోధ్య కంటోన్‌మెంట్‌ రైల్వేస్టేషన్‌గా, అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, మొఘల్‌సరాయ్‌ పట్టణాన్ని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయనగర్‌గా మార్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం మొదలవడం, వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం కమలదళానికి సానుకూలాంశాలు. మథురలో ఈద్గా మసీదు ఉన్నచోట కృష్ణ జన్మభూమి ఆలయాన్ని నిర్మిస్తామని కూడా ఆ పార్టీ నేత కేశవ్‌ప్రసాద్‌ మౌర్య ఇటీవల ప్రకటించారు. యూపీలో తాజా అసెంబ్లీ ఎన్నికలను 80% మందికి, 20% మందికి మధ్య జరుగుతున్న పోరుగా యోగి ఇటీవల అభివర్ణించారు. ముస్లింలను ఉద్దేశించే ఆయన ‘20%’ అనే పదాన్ని ప్రయోగించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బీఎస్​పీ.. బ్రాహ్మణ ఓటర్లపై కన్ను!

BSP soft hindutva: మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ).. హిందువులను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మాయావతి స్వాగతించారు. తాము అధికారంలోకి వస్తే కాశీ, మథురల్లోనూ ఆలయ నిర్మాణ పనులను అడ్డుకోబోమని ప్రకటించారు. ఈ దఫా ఎన్నికల ప్రచార పర్వానికి అయోధ్య నుంచే ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో దాదాపు 10%గా ఉన్న బ్రాహ్మణ వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు బీఎస్పీ ప్రయత్నిస్తోంది. 2007లో ఆ పార్టీ విజయంలో దళితులతో పాటు బ్రాహ్మణ ఓటర్లు కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్‌... 'అయోధ్య'కు దూరంగా

Congress election campaign Ayodhya: ముస్లింలు దూరమవుతారన్న ఆందోళనల నేపథ్యంలో అయోధ్య రామమందిరం వ్యవహారం నుంచి కాంగ్రెస్‌ కాస్త దూరంగా ఉంటోంది! 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రం ప్రియాంకాగాంధీ వాద్రా.. హనుమాన్‌ గఢీని సందర్శించారు. రామజన్మభూమి ఆలయం నుంచి అది కేవలం 1 కిలోమీటరు దూరంలో ఉంది.

ఎస్పీ... అటూ.. ఇటూ..

BSP hindu muslim politics: అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అటు హిందువులను, ఇటు ముస్లింలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ముస్లింల అనుకూల పార్టీగా ఉన్న పేరును తొలగించుకునేందుకు పలువురు ఎస్పీ నేతలు ఇటీవలి వరకు ఆలయాలకు లైన్లు కట్టారు. ‘శ్రీరాముడు ఎస్పీకి చెందినవారే’ అని 2020 డిసెంబరులో అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆయన పలు దేవాలయాలకు వెళ్లారు. ఎన్నికలు దగ్గరపడ్డాక పార్టీ ధోరణిలో కొంత మార్పు వచ్చింది. గాంధీతో కలసి స్వాతంత్య్రం కోసం మహ్మద్‌ అలీ జిన్నా పోరాడారని వ్యాఖ్యానించారు. ఈ నెలలో అయోధ్యలో జరగాల్సిన విజయ రథయాత్రను రద్దు చేశారు. ఇవి ముస్లింలకు దగ్గరయ్యే ప్రయత్నాలేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎంఐఎం... ఒవైసీ జోరు

అయోధ్యకు దూరంగా ఉంటూ ఇతర ఆలయాలను కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ నేతలు సందర్శిస్తుండటాన్ని (సాఫ్ట్‌ హిందుత్వ విధానం) ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. లౌకికవాదం ముసుగులో దోపిడీకి ప్రయత్నిస్తున్న పార్టీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముస్లింలకు ఆయన పిలుపునిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details