UP Election 2022: పాత ముఖాలను వదలించుకుని కొత్తవాళ్లతో కాంగ్రెస్‌కు జవజీవాలు తీసుకురావాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నడుంకట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త అవతారంతో బరిలోకి దిగాలని ఆమె లక్షిస్తున్నారు. ఇంతవరకు ఆ పార్టీ రెండు దఫాలుగా ప్రకటించిన మొత్తం 166 మంది అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారే. 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామనే వాగ్దానాన్ని ఆమె నిలబెట్టుకుంటున్నారు.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 7 సీట్లు గెలవగా, రెండు సీట్లలో విజేతలు భాజపాలోకి ఫిరాయించారు. చాలా ఏళ్ల క్రితమే యూపీని చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. అక్కడ కొత్తతరం నాయకులను తయారుచేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మహిళలు, యువత, రైతులు, వెనుకబడిన కులాలు, దళితుల సమస్యలపై పోరాడుతున్న వారిని కాంగ్రెస్ అక్కున చేర్చుకొంటోందని పార్టీ ప్రతినిధి అన్షు అవస్థి చెప్పారు.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్(55)కు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఉద్యమించిన సదాఫ్ జాఫర్, ఆశా కార్యకర్తల కోసం పోరాడి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సభలో భౌతిక దాడికి గురైన పూనం పాండే, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన రామ్ రాజ్ గోండ్ కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు.
త్రుటిలో చేజారిన సీట్లపై ప్రత్యేక దృష్టి
ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభలో మొత్తం 403 సీట్లు ఉన్నాయి. వాటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 ఓట్ల కన్నా తక్కువ మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన 47 నియోజకవర్గాలపై ఈసారి అన్ని పార్టీలూ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. వీటిలో 23 స్థానాలను భారతీయ జనతా పార్టీ, 13 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ, 8 సీట్లను బహుజన్ సమాజ్ పార్టీ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, అప్నాదళ్, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు ఒక్కొక్కటి చొప్పున గెలిచాయి. ఈసారి బలమైన అభ్యర్థులను నిలబెట్టి గట్టి ప్రయత్నం చేస్తే ఈ 47 సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవచ్చని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.
ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ
2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 200 కన్నా తక్కువ ఓట్ల మెజారిటీతో రెండు సీట్లు గెలిచింది. 432 ఓట్ల ఆధిక్యంతో బహుజన్ సమాజ్ పార్టీ ఒక సీటు గెలిచింది. ఇలా 1000 ఓట్లకన్నా తక్కువ మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. కనౌజ్ ఎస్.సి. రిజర్వుడు సీటును భాజపా 2,500 ఓట్ల తేడాతో కోల్పోయింది. ఈసారి అక్కడ ఐపీఎస్ మాజీ అధికారి ఆసిం అరుణ్‌ను పోటీలో దింపింది. ఇలాంటి నియోజకవర్గాలపై పార్టీలన్నీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి.
కాంగ్రెస్ గూటికి ప్రముఖ నేతలు
uttarakhand election 2022: ఉత్తరాఖండ్ కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో ఉద్దండ నాయకులు హరక్‌సింగ్ రావత్, యశ్‌పాల్ ఆర్యలు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఫిబ్రవరి 14న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలను తాజా పరిణామం మెరుగుపరుస్తుందని విశ్లేషకుల అంచనా.