UP election 2022: స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు దాదాపు అన్ని ఎన్నికల్లోనూ భాజపా దూసుకుపోతుంటే.. ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రం అందుకు విరుద్ధంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. దాదాపు 70 ఏళ్లు దేశంలో చక్రం తిప్పిన హస్తం పార్టీ.. ఇప్పుడు ఘోర పరాభవాన్ని చవిచూస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే పునరావృతం అయింది. ముఖ్యంగా.. ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థులు రికార్డు స్థాయిలో డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దపడుతోంది.
కాంగ్రెస్ 97 శాతం
399 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలో దించగా.. 387 (97శాతం) మందికి దరావతు కూడా దక్కలేదు. రెండు స్థానాల్లో అతి స్వల్ప అధిక్యంతో గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్‌కు 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. యూపీలో హస్తం పార్టీ ఇంతటి ఘోర పరాజయాన్ని ఎన్నడూ చూడలేదు. ఏ స్థానంలోనైనా డిపాజిట్ కాపాడుకోవాలంటే అభ్యర్థి మొత్తం ఓట్లలో 16.66శాతం పొందాలి.
బీఎస్పీ 72 శాతం
అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కేవలం ఒక్కటంటే ఒకే స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీకి చెందిన 290 (72 శాతం)మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.