UP Election 2022: ప్రపంచం సంక్షోభ కాలంలో ఉందని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ. కరోనా, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. ఎలాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా భారత్ ఎదుర్కొంటుందని చెప్పారు. ఆపరేషన్ గంగా ద్వారా వేలాది మంది భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ మేరకు యూపీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు.
"ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత్ వాటిని ధీటుగా ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్లో చిక్కుకున్నవారిని తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్నవారిని 'వందే భారత్' కార్యక్రమంతో స్వదేశానికి తీసుకువచ్చాం. అఫ్గానిస్థాన్ సంక్షోభ సమయంలో 'దేవీ భారత్' పేరుతో తరలింపు ప్రక్రియ చేపట్టాం. కరోనా పరిస్థితుల్లో అన్ని దేశాలు చేతులెత్తేశాయి. కానీ పేదల కోసం భారత్.. రూ. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించింది. రూ.30 వేల కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమచేశాం. రూ.1.25 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో వేశాం."
-ప్రధాని నరేంద్ర మోదీ