UP election 2022: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో వర్చువల్ ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు యూపీలో రాజకీయ పక్షాలు సాంకేతిక సన్నాహాల్లో తలమునకలవుతున్నాయి. ఇప్పటికే భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాదీ వంటి పార్టీలు సామాజిక మాధ్యమాల్లో వేర్వేరు అంశాలపై ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వర్చువల్ బహిరంగ సభలు వంటివి నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని శనివారం షెడ్యూలు విడుదల సందర్భంగా ఈసీ ప్రకటించింది.
త్రీడీ సాంకేతికత.. వర్చువల్ ర్యాలీలు
త్రీడీ సాంకేతికతను ఉపయోగించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్చువల్ ర్యాలీలు నిర్వహించేందుకు భాజపా సమాయత్తమవుతోంది. నాయకులు వేర్వేరు చోట్ల నుంచి పాల్గొన్నా ఒకే వేదికపై ఉన్నట్లుగా చూపించడం దీనిలో సాధ్యమవుతుంది. పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ దీనిని పెద్దఎత్తున వాడబోతున్నారు. వాట్సప్, ట్విట్టర్ ద్వారా కూడా బూత్‌స్థాయి బృందాలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
డిజిటల్ వినియోగంపై సమాజ్‌వాదీ కార్యకర్తలకు ఇప్పటికే శిక్షణ అందిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ వాట్సప్ బృందాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటివాటినీ ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా వినియోగించుకోనున్నారు.
డిజిటల్ ర్యాలీల్లో ప్రీయాంక
ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే యూపీలో పర్యటనలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రణాళిక రూపొందించుకున్నారు. కరోనా పరిస్థితుల్లో వాటిని రెండువారాల పాటు వాయిదా వేసుకుని, ఇప్పుడు డిజిటల్ ర్యాలీల్లో పాల్గొ నబోతున్నారు.
ప్రత్యర్థులతో పోలిస్తే ఈ విషయంలో బీఎస్పీ ఇంతవరకు వెనుకబడింది. ఈసీ ప్రకటన తర్వాత మాత్రం పంథా మార్చబోతోంది.
తెరపైకి పరశు'రామ' మంత్రం!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలకు పురాణ పురుషుడైన పరశురాముడు సహాయం అవసరమైంది. శ్రీరాముడిని నిత్యం స్మరించే భాజపా వ్యూహాత్మకంగా పరశురాముడిని తెరపైకి తీసుకొచ్చింది. తొలుత ఈ ఎత్తుగడను సమాజ్‌వాదీ పార్టీ వేసింది. ఆ పార్టీ గతంలోనే గోసాయిగంజ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారి పక్కన పరశురాముని ఆలయం నిర్మించింది.
దీంతో పలువురు సీనియర్ బ్రాహ్మణ నేతలు ఎస్పీ వైపు మొగ్గుచూపడం లేదా ఆ పార్టీలోకి వలస వెళ్లడాన్ని భాజపా నాయకత్వం గ్రహించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇదే అంశంపై దిల్లీలో పార్టీకి చెందిన బ్రాహ్మణనేతలు, కొందరు మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కమలంపై బ్రాహ్మణుల అసంతృప్తి, ఆగ్రహం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. నష్ట నివారణ కోసం సత్వరమే ఏమైనా చేయాలన్న నిర్ణయంలో భాగంగా లఖ్‌నవూలోని కృష్ణానగర్‌లో 11 అడుగుల ఎత్తైన పరశురాముడి విగ్రహాన్ని భాజపా బ్రాహ్మణనేత, ఉప ముఖ్యమంత్రి దినేశ్‌శర్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రి బ్రిజేష్‌పాఠక్, ఎంపీరీటా బహుగుణ జోషి పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీసీ, దళిత, ముస్లిం వర్గాల తరువాత చాలా రాజకీయ పార్టీల దృష్టి బ్రాహ్మణ ఓటర్లపైనే ఉంది. యూపీలో వారి జనాభా 12శాతం కంటే ఎక్కువ. అయితే, బ్రాహ్మణ ఓటర్లు 15శాతానికి పైగా ఉన్న నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలా కనిపిస్తాయి. భాజపా పరశరాముని విగ్రహస్థాపనపై ప్రతిషక్షాలు విరుచుకుపడ్డాయి. యోగి పాలనపై ఆగ్రహంతో ఉన్న బ్రాహ్మణులను బుజ్జగించి ఆకట్టుకునేందుకు భాజపా ఈ నాటకం ఆడుతోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో గెలుపుపై భాజపా కన్ను
ప్రతి ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారే దేహ్రాదూన్‌లో ఈ విడత ఆ ఆనవాయితీని తిరగరాయాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. భారీ అధిక్యంతో అధికారంలోకి వచ్చినా గత ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చాల్సి రావడం, ప్రభుత్వంపై వ్యతి రేకత వంటివి పరిస్థితిని మరింత జఠిలం చేస్తున్నా, కమలనాథులు మాత్రం ఆశాభావంతో పావులు కదుపుతున్నారు. గతసారి భాజపా, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి సమరం జరిగితే ఈసారి బరిలో ఆప్ దిగడంతో కొన్నిచోట్ల ముక్కోణ పోటీ అనివార్యమవుతోంది.
ఇవీ చూడండి:
దేశంలో కరోనా విలయం- ప్రధాని మోదీ కీలక భేటీ
Azadi ka amrit mahotsav: చంపినా చావని ధైర్యం.. తురుంఖాన్