ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారంటూ విమర్శించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ గతేడాది ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. ఈ పర్యటన గురించి అఖిలేశ్ యాదవ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "మంచిదే. ఒకరోజు కాదు.. మూడు నెలలైనా వారణాసిలో ఉండొచ్చు. అలా ఉండడానికి పూర్తి అనువైన ప్రదేశం. ఎందుకంటే చివరి రోజుల్లో అందరూ వారణాసిలోనే గడపాలని కోరుకుంటారు" అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లోనే దుమారం రేగడంతో అఖిలేశ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భాజపాకు రోజులు దగ్గర పడ్డాయన్న ఉద్దేశంలో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు.