తమ ప్రేమకు అడ్డు చెపుతోందన్న కోపంతో ప్రియురాలి తల్లిని హత్య చేశాడు ఓ కిరాతకుడు. పదునైన ఆయుధంతో గొంతుకోసి చంపాడు. అయితే ఈ ఘటనలో మృతురాలి మైనర్ కూతురు పాత్ర ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రా భవ్న అరోమా ప్రాంతంలోని శాస్త్రిపురం సికంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భావ్న అరోమా ప్రాంతానికి చెందిన ఉదిత్ బజాజ్, అంజలి బజాజ్ భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు ఉంది. ఉదిత్ బజాజ్ ఫుట్‌వేర్ వ్యాపారి. అయితే, బుధవారం రాత్రి నుంచి తన భార్య అంజలి కనిపించడం లేదని ఉదిత్.. సికంద్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య అంజలి సమీపంలోని మహాదేవ్ ఆలయానికి వెళ్లి తిరిగిరాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మహాదేవ్ ఆలయ సమీపంలో అంజలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఇదీ జరిగింది..
అంజలి కూతురు వాట్సాప్ ద్వారా తన తల్లికి మహాదేవ్ ఆలయానికి రమ్మని పిలిచింది. అంజలి ఈ విషయాన్ని తన భర్త ఉదిత్‌తో చెప్పి.. ఇద్దరూ కలిసి మహాదేవ్ ఆలయానికి చేరుకున్నారు. అదే సమయంలో 'గురూస్ పూల్' వద్దకు వచ్చి తనను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కూతురు నెంబర్ నుంచి ఉదిత్‌కు మరో సందేశం వచ్చింది. దీంతో ఉదిత్ తన భార్య అంజలిని ఆలయం వద్దే వదిలి కూతురు చెప్పిన అడ్రస్‌కు బయళ్తేరాడు. అంతలోనే తను ఇంటికి చేరుకున్నట్లు కూతురు ఫోన్ చేసి తండ్రితో చెప్పింది. ఇక తిరిగి ఆలయానికి వెళ్లిన ఉదిత్ బజాజ్‌కు తన భార్య అక్కడ కనిపించలేదు.