UP Bulldozer news: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ వ్యాఖ్యలు నేరస్థుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి. తప్పు చేస్తే ఏ క్షణంలో అధికారులు బుల్డోజర్ను తమ ఇంటికి తీసుకొస్తారేమో అనే భయం నెలకొంది. ఇటీవల అత్యాచార నేరస్థుల ఇళ్ల ముందు బుల్డోజర్లు పెట్టగా.. కొన్ని గంటల్లోనే చాలా మంది నిందితులు లొంగిపోయారు. ఇప్పుడు ఓ వ్యక్తి తన ఇంటిని కూల్చేయాలంటూ ఏకంగా సీఎం యోగికే లేఖ రాశారు. ఈ సంఘటన రామ్‌పుర్ జిల్లాలో జరిగింది.
రామ్‌పుర్‌లోని మిత్రపుర్ అరేలాకు చెందిన ఎహసాన్ అనే వ్యక్తి తన ఇంటిని కూల్చేయాలని కోరుతూ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సొంత ఇంటిని కూల్చమనటం చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఈ విషయంపై ఆరా తీయగా కొన్నేళ్ల క్రితం చెరువును పూడ్చి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తేలింది. సబ్‌కలెక్టర్‌తో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు ఆ వ్యక్తి. తన ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందని, అక్రమంగా కట్టిన తన ఇంటిని కూల్చేయాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఎహసాన్. ఆ ఇంటిని తన ముత్తాత నిర్మించాడని, భూమి పత్రాలను పరిశీలించగా అది చెరువులో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. ఆ కారణంగానే ఇంటిని కూల్చేయాని ఎస్‌డీఎమ్‌ను కోరినట్లు చెప్పారు.